నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం విధుల్లో ఉన్న డాక్టర్ సంతోష్‌రాజ్, ఆస్పత్రి సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మహ్మద్ సల్మాన్ సోదరి కూతురు అనారోగ్యం బారిన పడడంతో ఇటీవల స్థానిక ఎస్వీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కోలుకుంది. పది రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. చికిత్సకు అయిన బిల్లుల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు బిల్లల కోసం గత గురువారం సల్మాన్ ఆస్పత్రికి వచ్చాడు. రెట్టింపు బిల్లులు ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. అందకు వారు నిరాకరించారు. తర్వాత డాక్టర్ సంతోష్‌రాజ్‌ను అడిగారు. ఆయన కూడా అలా ఇవ్వడం కుదరదని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన మహమ్మద్ సల్మాన్ డాక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అనంతరం మహమ్మద్ షౌకత్, షాబాద్ అలీ, మహమ్మద్ ఆజాద్ హుస్సేన్‌ను అక్కడికి పిలిపించి ఆస్పత్రి సిబ్బందితోపాటు డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై హాస్పిటల్ యజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సాక్షుల వివరాలు, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి దాడికి పాల్పడిన నలుగురు నిందితులను గుర్తించారు. శనివారం వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనకు శ్రమించి నిందితులను పట్టుకున్న ఏఎస్పీ సాయికిరణ్, భైంసారూరల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణను ఎస్పీ జానకీషర్మిల అభినందించారు.


