పంట దిగుబడులు పుష్కలం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఆందోళన ప్రైవేటు వ్యాపారులకే పంట విక్రయాలు
భైంసా/నర్సాపూర్(జి): జిల్లాలో రైతులు కష్టపడి పండించిన పంటలకు సరైన మార్కెట్, కొనుగోలు సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది శనగ, మొక్కజొన్న, కంది పంటలు మంచి దిగుబడిని ఇచ్చాయి. కానీ ప్రభుత్వం సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతులను కష్టాల్లోకి నెడుతోంది. రైతులు దిగుబడి అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.
వేల ఎకరాల్లో పంటల సాగు...
జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో శనగ, 64 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 14 వేల ఎకరాల్లో కంది పంటలు సాగుచేశారు. ఎకరాకు శనగ 13 క్వింటాళ్లు, మొక్కజొన్న 40 నుంచి 50 క్వింటాళ్లు, కంది సుమా రు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. జిల్లాలో నిర్మల్, భైంసా, కుభీర్, సారంగాపూర్, ఖానాపూర్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ యార్డుల్లో నెల రోజులుగా ప్రైవేటు వ్యాపారులే పంటలు కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోళ్లలో జాప్యం...
జిల్లా వ్యాప్తంగా శనగ పంట కేంద్రాలు తప్ప మిగతా ఏ పంటలు కొనుగోలు చేయడం లేదు. కానీ మొక్కజొన్న, కంది పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు తమ పంటను ఎక్కడ అమ్మాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారు. ఇక మరోవైపు, జొన్న, వరి పంటల కోతలు కూడా మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు లేకపోతే, రాబోయే పంటల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముంది. పంటలన్నీ ఒకేసారి మార్కెట్‌లోకి వస్తే ధర మరింత పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరలు కల్పించాలని కోరుతున్నారు.
మద్దతు ధర దక్కక...
కేంద్ర ప్రభుత్వం శనగ పంటకు క్వింటాల్‌కు రూ.5,875 ధర ప్రకటించింది. మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక శనగ పంట క్వింటాలుకు రూ.4,800 నుంచి రూ.5,200 వరకు ప్రైవేటు వ్యాపారులు ధర ఇస్తున్నారు. ఇక మొక్కజొన్న పంట ధర మరీ తగ్గించేస్తున్నారు. క్వింటాలుకు రూ.1500 నుంచి రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారు.
కొనుగోళ్లు లేక ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన శనగ పంట
ఆదేశాలు రాలేదు..
ప్రస్తుతం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాగానే మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తాం.
– ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం


