నిర్మల్ రూరల్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక అమలులో నిర్లక్ష్యం, అపరిశుభ్రత, మెనూ అమలు లోపాలపై వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ అభిలాష అభినవ్ తీవ్రంగా పరిగణించారు. పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశా రు. ఇటీవల హైదరాబాదులో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రభు త్వ పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన నా ణ్యతపై ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన భోజనం అందేలా చూడటం తమ మొదటి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుత పర్యవేక్షణ కోసం మంగళవారం నుంచే ప్రత్యేక వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.
కడ్తాల్ హెచ్‌ఎం సస్పెన్షన్
సోన్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం ప్రదర్శించిన హెచ్‌ఎం కె.వెంకటేశ్వర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. భోజనంలో పురుగులు, రాళ్లు కనిపించడం, నాణ్యతలేమి, మెనూ ప్రకారం ఆహారం అందకపోవడం వంటి అంశాలపై కొందరు విద్యార్థులు, గ్రామస్తులు డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 23న డీఈవో దర్శనం భోజన్న, సంబంధిత అధికారులతో కలిసి పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులతోపాటు భోజనంచేసి పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల ప్రాంగణం, కిచెన్ షెడ్డు, మధ్యా హ్న భోజన రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించిన అధికారులు అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భోజనంలో పురుగులు కనిపించడం, కిచెన్ షెడ్డు పరిశుభ్రంగా లేకపోవడం, మెనూ పాటించకపోవడం వంటి కారణాలపై హెచ్‌ఎంను బాధ్యుడిగా కలెక్టర్‌కు నివేదించారు. కలెక్టర్ ఆదేశాలతో హెచ్‌ఎం కె.వెంకటేశ్వర్‌ను సస్పెండ్ చేశారు.
హెచ్‌ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలి..
కడ్తాల్ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ కె.వెంకటేశ్వర్‌పై విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ (టీయుటీఎఫ్) నాయకులు కోరారు. జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్, ప్రధాన కార్యదర్శి వాహిద్‌ఖాన్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 23న జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ పూర్తికాకముందే మరుసటి రోజే సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయడం తగదని వ్యాఖ్యానించారు.
జిల్లాలో 733 మంది స్పెషల్ ఆఫీసర్లు
జిల్లాలో కొన్నిచోట్ల మధ్యాహ్న భోజన నిర్వహణపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ దిద్దుబాటు చర్యగా కొత్త పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 733 మంది స్పెషల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు ఒక స్పెషల్ అధికా రిని కేటాయించి, వారు ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను నిరంతరం పరిశీలిస్తారు. సీనియర్ ఉపాధ్యాయులను స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపిక చేశారు. మంగళవారం నుంచే విధుల్లో చేరిన స్పెషల్ అధికారులు తమ తమ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.
విచారణ చేస్తున్న డీఈవో భోజన్న


