నిర్మల్‌చైన్‌గేట్: వేసవికాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. వేసవి ప్రణాళికపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బ బారినపడిన ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో మెరుగైన చికిత్స అందించాలన్నారు. ప్రజల దాహార్తి తీర్చేలా, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు విరివిగా ఓఆర్‌ఎస్ పొట్లాలు పంపిణీ చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు అధిక ఉష్ణోగ్రత సమయంలో జాగ్రత్తవగా ఉండాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉంటూ, వడదెబ్బ సమస్యలతో వచ్చే వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైనచోట బోరు బావులకు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలన్నారు. ఎక్కడైనా నీటి ఇబ్బందులు ఏర్పడితే, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సమస్యలు తీర్చాలన్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువ సంభవించేందుకు ఆస్కారం ఉన్నందున అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


