నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల కు అంతరాయం లేకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాక్ వివరాలపై సమీక్షించారు. విద్యార్థు ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ వసతిగృహంలో సరిపడా సిలిండర్ల నిల్వ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు వసతి గృహాల అవసరాలకు అనుగుణంగా సమయానికి సిలిండర్లు సరఫరా చేయాలని సూచించారు. వసతి గృహాల నిర్వాహకులు గ్యాస్ ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సరఫరా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత తహసీల్దార్లకు సమాచారం అందించాలని సూచించారు. తహసీల్దార్లు తరచూ వసతి గృహాల ను తనిఖీ చేసి గ్యాస్ సిలిండర్ల నిల్వను పరిశీలించా లని ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, వసతి గృహాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతిని ధులతో సమావేశాలు నిర్వహించి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, శ్రీనివాస్, మోహన్‌సింగ్ పాల్గొన్నారు.
అందుబాటులో సరిపడా గ్యాస్
జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకుంటే నిర్ణీత గడువులోపు ఆయా ఏజెన్సీలు డోర్ డెలివరీ చేస్తాయని తెలిపారు. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎక్కడా గ్యాస్ కొరత లేదని తెలిపారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదని సూచించారు.
మౌలిక వసతులు కల్పించాలి
ప్రభుత్వ ఎస్సీ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాగునీరు, లైటింగ్, డ్రైనేజీ, పైకప్పు లీకేజీ మరమ్మతులు, గ్రిల్స్ ఏర్పాటు, విద్యుత్ సంబంధిత పనులు, లెవెలింగ్ పనులు తదితర మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. పనులు వెంటనే ప్రారంభించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి దయానంద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు.


