సారంగపూర్: జిల్లాలో మొరం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మండలంలోని జామ్ గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌లతో కలిసి కరిసెలగుట్ట ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. తహసీల్దార్ సంధ్యారాణి, ఎంఆర్‌ఐ నర్సయ్యను మొరం తవ్వకాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయి.. ఎక్కడి తరలిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దమొత్తంలో మొరం తరలిపోతుంటే ఏం చేస్తున్నారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. గ్రామస్తులు తమ అవసరాలకు, ప్రభుత్వ భ వనాలు, శ్మశానవాటిక, సీసీరోడ్లు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం కోసం ఇక్కడి నుంచి మొరం తరలించార ని, ఇటీవల ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే తరలించారని తహసీల్దార్ వివరించారు. తమ అవసరాల కోసమే తవ్వకాలు జరిపామని పలువురు గ్రామస్తులు సైతం కలెక్టర్‌కు వివరించారు. అనంతరం అక్కడే ఉన్న మైనింగ్ ఏడీ హరిప్రసాద్‌ను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మొరం తవ్వకాలకు అనుమతులు ఎలా ఇచ్చారని, ట్యాక్స్ ఎంత వసూలు చేశారని కలెక్టర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లకు తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, జీపీవోను సమన్వయం చేసుకుని అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, జామ్ ఉపసర్పంచ్ బి.గంగాధర్, ఆయా గ్రామాల నాయకులు విలాస్, అంబాజీ, రాజలింగం, తదితరులు ఉన్నారు.
గ్యాస్ గోదాం పరిశీలన...
సారంగాపూర్/నిర్మల్‌చైన్‌గేట్: అంతకుముందు మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ గోదాంను తనిఖీ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ అందుబాటులో ఉందా లేదా అని సిబ్బందిని అడిగారు. గృహ, వాణిజ్య అవసరాలకు తగినంత గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. వినియోగదారులు గ్యాస్ బుక్‌చేసుకుంటే నిర్ణీత సమయంలో సరఫరా జరుగుతుందని తెలిపారు. సరఫరాలో ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబరు 910 0577132ను సంప్రదించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి, ప్రజలకు సరిపడినన్ని సిలిండర్లను సాఫీగా పంపిణీ చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ ఉండదని హెచ్చరించారు. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ పేర్కొన్నారు. అక్రమ పట్టాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆక్రమణకు గురైన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పారిశ్రామిక శాఖకు అప్పగించినట్లు తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూములపై ఆక్రమణలు జరగకుండా నిరంతర నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.
అసైన్డ్ భూముల్లో వ్యాపారాలపై కొరడా
నిర్మల్‌చైన్‌గేట్: అసైన్డ్ భూముల్లో వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. తానూరు మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులు తమకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేయకుండా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కొందరు మొరం వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులను గుర్తించి, వారి పేరిట ఉన్న పట్టాలు రద్దు చేసినట్లు తెలిపారు. అసైన్డ్ భూములను సాగుకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మెరుగైన భద్రత నిర్వహించాలన్నారు. అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.


