బాసర: బాసర ఆర్జీయూకేటీలో సాంకేతికత, సృజనాత్మకత, విద్యార్థుల ఉత్సాహం కలిసిన జాతీయస్థాయి అంతఃప్రజ్ఞ–2026 కార్యక్రమం ఈనెల 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన భారీ బ్యానర్ ఆవిష్కరణ, డ్రోన్ ప్రదర్శన, ఫ్లాష్‌మాబ్ ఆదివారం నిర్వహించారు. భారీ బ్యానర్‌పై అంతఃప్రజ్ఞ 2026 లోగోతోపాటు కార్యక్రమ వివరాలు ప్రదర్శించారు. డ్రోన్ ప్రదర్శనలో ఆకాశంలోకి ఎగసిన డ్రోన్ మహోత్సవాన్ని ప్రతిబింబించే చిన్న బ్యానర్‌ను విడుదల చేసింది.
విద్యార్థుల ఫ్లాష్‌మాబ్
ఇక విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకుంది. ఇది కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫ్యాకల్టీ కన్వీనర్ జె.స్వప్నిల్, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.రాములు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడు రోజుల మహోత్సవానికి దేశవ్యాప్తంగా 25 వేల మందికిపైగా విద్యార్థులు, సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రతిభలకు జాతీయ వేదికగా నిలుస్తుంది. విద్యార్థి సమన్వయకర్తలు కె.వివేక్, జి.వంశీ, ఎం.వెంకటకృష్ణ పాల్గొన్నారు.


