మహిళా పోలీస్‌లతో ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్/నిర్మల్‌టౌన్/నిర్మల్‌చైన్‌గేట్: ‘మనకంటూ ఒకరోజు. ఇది మనదైన రోజు..’ అంటూ మహిళా దినోత్సవాన్ని జిల్లా మహిళలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు. మహిళలందరికీ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ, సాధికారతకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలో వివిధ సంఘాలు, మహిళ గ్రూపులు, కిట్టీపార్టీల ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా అతివల సంబురాలు కొనసాగాయి. రోజంతా కలిసి ఆడుతూ, పాడుతూ.. కలిసి భోజనాలను చేశారు. కలిసికట్టుగా సీ్త్రల హక్కులనూ సాధించుకుందామంటూ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని ఐన్ కంటిదవాఖానా వైద్యుడు ఇర్ఫాన్‌ఫరాజ్ 31 మంది మహిళలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించారు. ప్రియదర్శినినగర్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి ఆధ్వర్యంలో వుమెన్స్‌డే నిర్వహించారు. అంగన్‌వాడీలు, ఆయాలు, ఆశ కార్యకర్తలను సన్మానించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు వాసవి, ఉపాధ్యక్షురాలు గీత పాల్గొన్నారు. ట్రెండీగర్‌ల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా వుమెన్స్‌డే సంబురాలు నిర్వహించారు. సభ్యులంతా నల్లరంగు డ్రెస్‌కోడ్‌లో హాజరయ్యారు. ఒక్కొక్కరు తమలోని బలాన్ని పేపర్‌పై రాసిచూపుతూ ఆత్మవిశ్వాసాన్ని చాటారు. అనంతరం కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో మహిళ ఉద్యోగులంతా కలిసి వుమెన్స్ డే నిర్వహించారు. ఇటీవల గెలుపొందిన మహిళ కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం తమ హక్కుల సాధన కోసం కలిసి సాగుదామని పిలుపునిచ్చారు. సంఘ బాధ్యులు ఆలియాసుల్తానా, రహత్‌నాజ్నీన్, ఆలియా ఫాతిమా, రోమాన, ఆయేషా, డాక్టర్ అమీనా తదితరులు పాల్గొన్నారు.


