గోదావరి తీరంలో ఆది మానవుల ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

గోదావరి తీరంలో ఆది మానవుల ఆనవాళ్లు

Mar 9 2026 7:42 AM | Updated on Mar 9 2026 7:42 AM

నిర్మల్‌ జిల్లాలో వెలుగుచూస్తున్న చారిత్రక ఆధారాలు మెగాలిథిక్‌ మైక్రోలిథిక్‌ టూల్స్‌ పరిశ్రమకు నిదర్శనాలు

నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌ జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రాచీన మెగాలిథిక్‌, మైక్రోలిథిక్‌ టూల్స్‌ తయారీ అవశేషాలు కనుగొనబడ్డాయి. చరిత్రకారుడు, కవి డాక్టర్‌ తుమ్మల దేవరావు ఈ ఆవిష్కరణను ప్రకటించారు. ఈ ఆధారాలు జిల్లా ప్రాచీన జీవన శైలిని వెలుగుపరుస్తున్నాయి. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరంలో ఈ అవశేషాలు గుర్తించారు. నదీ ప్రాంతాలు ఆహారం, నీరు అందించడంతో ఆదిమానవులు ఇక్కడ స్థిరపడి వేటకు యుధాలు తయారు చేసుకున్నారు. రాతి పరుపులపై గ్రూవ్స్‌(లోతైన గీతలు) ఈ కార్యక్రమానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

తయారీ తంత్రం..

ఈ గీతల్లో రాతి గొడ్డళ్లను మెరుగుపరచి, ఆయుధాలకు, కత్తెరల్లా పరికరాలకు పదును పెట్టినట్లు తెలిపారు. మైక్రో బ్లేడ్లు, యారోపాయింట్లు(బాణ అంచులు), స్క్రాపర్లు(చర్మ తొలిచే పరికరం), కోర్‌ స్టోన్లు, జామెట్రిక్‌ మైక్రోలిథ్‌లు 0.4 నుంచి 1 సెం.మీ. పరిమాణంలో లభించాయి. గ్రూవ్స్‌ సమీపంలోనే ఈ పరికరాల సంగ్రహం ఎక్కువగా ఉండటం ఆసక్తికరం.

క్రీ.పూ 10 వేల నుంచి 4 వేల

సంవత్సరాల మధ్య..

క్రీస్తుపూర్వ 10 వేల సంవత్సరం నుంచి 4 వేల సంవత్సరాల వరకు ఈ ఆయుధ కళ ఊపందుకున్నట్లు అంచనా. వేట ఆధారిత మనుగడకు జంతు చర్మాలు, ఆయుధ అంచులు తయారీకి ఈ సాధనాలు ఉపయోగపడ్డాయి. పరిశోధనలో డాక్టర్‌ తుమ్మల దేవరావుతో అబ్బడి రాజేశ్వర్‌ రెడ్డి, తుమ్మల సుజాత సహకరించారు.

బహుళ కర్మాగారాలు ఉంటాయని..

గోదావరి ప్రాంతంలోని వివిధ చోట్ల ఇలాంటి తయారీ కేంద్రాలు ఉండవచ్చని పరిశోధకులు ఊహిస్తున్నారు. ఈ ఆనవాళ్లు నిర్మల్‌ ప్రాచీన చరిత్రకు బలమైన సాక్ష్యాలు. గోదావరి ప్రాజెక్టు పరిధిలో ఇంతకుముందు కూడా సారవంతమైన కనుగొన్నవి ఉన్నాయి. పురావస్తు శాఖ, ప్రభుత్వం ఈ ఆధారాలను కాపాడాలని పరిశోధకులు కోరుతున్నారు. ఇవి ఆదిమానవ సంచారాలు, మనుగడ వ్యూహాలను, జిల్లా చరిత్రను, గతాన్ని పునరుద్ధరించడానికి కీలకం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement