భైంసాటౌన్: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మన వంటిట్లో మంట పెట్టింది. యుద్ధం కారణంగా చమురు సరఫరా మందగించింది. ఫలితంగా పెట్రోలియం ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్రం వంటగ్యాస్ ధరలు పెంచింది. 14.2 కిలోల గృహ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.929 ఉండగా, రూ.60 పెరిగి, రూ.989కు చేరింది. పెరిగిన ధరలు అన్నిరకాల కనెక్షన్లకు వర్తించనున్నట్లు గ్యాస్ ఏజెన్సీలు తెలిపాయి. ఇక, వాణిజ్య సిలిండర్ ధర రూ.2,029 ఉండగా, రూ.2,144 కు పెరిగింది. వీటికితోడు రూ.20 నుంచి రూ.30 వరకు డెలీవరీ చార్జీలు ఉండనే ఉన్నాయి. ఫలితంగా వంటగ్యాస్ వినియోగదారులపై ఆర్థికంగా భారం పడనుంది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో హెచ్‌పీ, భారత్, ఐవోసీ కంపెనీలకు చెందిన 16 గ్యాస్ ఏజెన్నీలు ఉన్నాయి. వీటి కింద సాధారణ, ఉజ్వల, దీపం, సీఎస్‌ఆర్ వంటగ్యాస్ కనెక్షన్లు దాదాపు 2.50 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో సింగిల్ కనెక్షన్లు 1,81,626 ఉండగా, రెండు నెలలకు ఒక వంటగ్యాస్ సిలిండర్ చొప్పున రూ.16.87 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.1.08 కోట్లకుపైగా అదనపు ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే సిలిండర్ అందిస్తామని తొలుత సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమచేసింది. కొద్దినెలలుగా ఈ సబ్సిడీ జమకావడం లేదు. కేవలం కేంద్రప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.43 మాత్రమే జమవుతోంది. దీంతో ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కింద రూ.500లకు సిలిండర్ అందిస్తుందా లేదా స్పష్టత రావాల్సి ఉంది.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
సాధారణ కనెక్షన్లు 1,39,430
దీపం కనెక్షన్లు 47,215
ఉజ్వల కనెక్షన్లు 37,249
సీఎస్‌ఆర్ కనెక్షన్లు 26,828
ఇతర కనెక్షన్లు 1063
మొత్తం కనెక్షన్లు 2,51,785


