అమ్మ తలుపు తెరిస్తేనే పొద్దు తెల్లారుతుంది. ఆలి అన్నీ సిద్ధం చేసిస్తేనే రోజు మొదలవుతుంది. బిడ్డ నవ్వుతూ ఎదురొస్తేనే ఆ రోజు బాగా గడుస్తుంది. అక్క ‘ఆల్ ది బెస్ట్’ చెబితేనే విజయం దక్కుతుంది. చెల్లితో గిల్లికజ్జాల జ్ఞాపకం జీవితాంతం గుర్తుంటుంది. ఆమే లేకుంటే.. ఏదీ లేదు. సృష్టికి మూలం, ప్రేమకు రూపం, ధైర్యానికి నిదర్శనం ఆమె. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రమజీవులుగా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కండక్టర్లతో ‘సాక్షి’ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జిల్లా కేంద్రంలో ఇంకా చీకట్లు తొలగకముందే చీపుర్లు పట్టుకుని పట్టణాన్ని పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో శనివారం వేకువజామున ముచ్చటించింది. తెల్లవారుజామున ఉరుకులు, పరుగులతో ‘ప్రగతిచక్రాల’లను పరుగులు పెట్టించేందుకు మహిళా కండక్టర్లను పలకరించింది. – నిర్మల్


