ఆర్జీయూకేటీలో విద్యార్థులు, యాజమాన్యం మధ్య లొల్లి ముదురుతోంది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న పరిపాలనా సమస్యలపై చర్చించేందుకు టీఎస్‌ఏఎస్ సభ్యులు శనివారం ఇన్‌చార్జి వీసీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సుమారు 50 మందికిపైగా విద్యార్థులు వీసీని కలిసేందుకు రెండు గంటలకుపైగా కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. టీఎస్‌ఏఎస్ అధ్యక్షుడు నవనీత్ మాట్లాడుతూ.. వీసీ కార్యాలయానికి వెళ్తే డీన్ దగ్గరకు, డీన్ కార్యాలయానికి వెళ్తే మళ్లీ వీసీ దగ్గరకు వెళ్లమని చెప్పుతూ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సమస్యలను చెప్పేందుకు వచ్చిన విద్యార్థులను గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, లోపలికి రాకుండా గేట్లు మూసివేయడం వంటి చర్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు వారాలుగా యూనివర్సిటీలో పలు పరిపాలనా సమస్యలు కొనసాగుతున్నాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని విద్యార్థులు తెలిపారు. వీసీ లేదా సంబంధిత అధికారులు ఒక తేదీ, సమయం కేటాయించి విద్యార్థుల సమస్యలను వినాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


