భైంసాటౌన్: పట్టణంలోని నారాయణ పాఠశాలలో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఫీజుల వసూలుపై ‘ఇదేం.. ఫీజులుం..!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈవో సుభాష్ పాఠశాలకు శుక్రవారం చేరుకుని ప్రిన్సిపాల్‌కు నోటీసు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులను బలవంతం చేయడంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ముందస్తుగా ఫీజులు ఏ అధికారం కింద వసూలు చేస్తున్నారని, అలాంటి సేకరణ కోసం సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందారా.. నిర్దేశించిన నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సంస్థపై ఎందుకు చర్య తీసుకోకూడదని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలోపు సంబంధిత సహాయక పత్రాలతోపాటు రాతపూర్వక వివరణ సమర్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ఎంఈవో తెలిపారు. గడువులోపు సమాధానం రాకపోతే, తదుపరి నోటీసు లేకుండా నిబంధనల ప్రకారం సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు గంగాప్రసాద్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ముందస్తు ఫీజుల వసూలుపై పాఠశాల నిర్వహకులు, ఎంఈవోను ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


