నాలుగు దశల్లో ఆరోగ్య పరీక్షలు నేటి నుంచి జూన్ 12 వరకు మిషన్–100 మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రణాళిక 30 రకాల వైద్య పరీక్షలు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీ
నిర్మల్‌చైన్‌గేట్: ఆరోగ్యకర సమాజ నిర్మాణమే ధ్యేయంగా, మహిళ ఆరోగ్యానికి భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘హెల్త్ మిషన్–100’ పేరుతో వంద రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయటానికి వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. మహిళా సంఘాల్లోని సభ్యులకు 30 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ పీహెచ్‌సీలలో ఈ మేరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళల కోసం సమగ్రమైన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ’విజన్–2047’లో భాగంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఈ 100 రోజుల ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు నాలుగు దశల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
30 రకాల వైద్య పరీక్షలు
జిల్లాలోని సుమారు 15,653 మహిళా సంఘాల్లో ఉన్న 1,74,917 మంది సభ్యులకు 30 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. వారి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తారు. అందుకనుగుణంగా వారికి హెల్త్ కార్డులు అందిస్తారు.
నాలుగు దశల్లో కార్యక్రమాలు...
మొదటి దశ (మార్చి 6 నుంచి 31వరకు)..
మొదటి దశలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, కంటి, ఎముకలు, దంతవైద్య, నిపుణులు ప్రత్యేక సేవలు అందిస్తారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వద్ధాప్య చికిత్స శిబిరాలు, స్కీన్రింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కంటి పరీక్షలు, పోషకాహారంపై అవగాహన, వ్యాధి నిరోధక టీకాల తనిఖీలు చేపడతారు.
రెండో దశ (ఏప్రిల్ 1–15వరకు)..
ఇందులో క్యాన్సర్ నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించి, కేర్ పాలసీని విడుదల చేస్తారు. రిజిస్ట్రీ ఏర్పాటు, ఆరోగ్య మహిళా పథకం కింద స్క్రనింగ్ క్యాంపులు, జిల్లా డే–కేర్ క్యాన్సర్ కేంద్రాల్లో కీమోథెరపీ సేవల మ్యాపింగ్ చేస్తారు.
మూడో దశ (ఏప్రిల్ 16– మే 15వరకు)..
మూడో దశలో వేసవిలో వడదెబ్బ, అతిసారం వంటి సమస్యలపై దృష్టి సారిస్తారు. టీబీ(క్షయ) కేసుల గుర్తింపు, పోషకాహారం అందించడం, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడతారు.
నాలుగో దశ(మే 16– జూన్ 12వరకు)..
చివరి దశలో పట్టణ, గిరిజన ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. అర్బన్ పీహెచ్‌సీను పాలీక్లినిక్స్‌గా అప్ గ్రేడ్ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమి యా, తలసేమియా, హీమోఫీలియా బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందిస్తారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
హెల్త్ మిషన్–100 కోసం సిబ్బందికి అవగాహన కల్పించాం. ఎప్పుడు ఏ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారనే విషయాన్ని గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ, మహిళా సంఘాల సభ్యులకు తెలియజేస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్‌వో
వివరాలు:


