పది హాల్‌టికెట్లపై క్యూ ఆర్‌ కోడ్‌ | - | Sakshi
Sakshi News home page

పది హాల్‌టికెట్లపై క్యూ ఆర్‌ కోడ్‌

Mar 6 2026 8:10 AM | Updated on Mar 6 2026 8:10 AM

● తొలిసారి వాట్సాప్‌కు హాల్‌ టికెట్‌ ● జిల్లాలో 9,750 మంది విద్యార్థులు

లక్ష్మణచాంద: పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ సమూల మార్పులు చేస్తోంది. పరీ క్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వార్షిక పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లు పాఠశాలకు చేరుకున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి పోస్టల్‌ శాఖ ద్వారా ముందస్తుగానే విద్యార్థుల హాల్‌ టికెట్లు వివిధ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ పంపించినట్లుగా ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

జిల్లాలో ఇలా...

జిల్లాలో 168 ప్రభుత్వ పాఠశాల నుంచి 3,013 బాలురు, 3,592 మంది బాలికలు, 73 ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 1773 మంది బాలురు, 1,372 మంది బాలికలు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమై వచ్చేనెల13 వరకు జరుగుతాయి.

హాల్‌టికెట్‌పై క్యూఆర్‌ కోడ్‌..

పదో తరగతి విద్యార్థుల హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కో డ్‌ను విద్యాశాఖ అధికారులు ముద్రించారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ను విద్యార్థులు ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేస్తే విద్యార్థి పరీక్ష వివరాలతోపాటు పరీక్ష కేంద్రం లైవ్‌ లొకేషన్‌ కూడా సూచిస్తుంది. అలాగే విద్యార్థు ల పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌(పెన్‌) కూడా హా ల్‌ టికెట్‌పై ముద్రించినట్లు అధికారులు తెలిపారు.

పోషకుల ఫోన్లకు..

విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా సులభంగా డౌన్లోడ్‌ చేసుకుకోవచ్చు. దీనికోసం ముందుగా 8096958096 నంబర్‌కు హాయ్‌ అని వాట్సాప్‌ చేయాలి. వెంటనే ‘వెల్కమ్‌ టు మీ సేవ’ అనే రిప్లై మెసేజ్‌ వస్తుంది. ఆ తరువాత ‘ఎస్సెస్సీ హాల్‌టికెట్‌ మార్చి–2026’ అని మెసేజ్‌ పంపితే ఒక లింక్‌ అందుతుంది. ఆ లింక్‌పై క్లిక్‌ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరును ఎంపిక చేసి, పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్‌ టికెట్‌ డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా ఇంటినుంచే హాల్‌ టికెట్లను పొందే సౌకర్యం కల్పించింది.

విద్యాశాఖ సూచనల మేరకు..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, పాఠశాల విద్యాశాఖ సూచనలకు అనుగుణంగా పదోతరగతి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర విద్యాశాఖ ఇదివరకే అన్ని పాఠశాలలకు పోస్టుద్వారా హాల్‌ టికెట్లు పంపించింది. పోషకుల వాట్సాప్‌కు కూడా విద్యార్థుల హాల్‌ టికెట్లు పంపడం జరిగింది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలి.

– భోజన్న, డీఈవో,నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement