లక్ష్మణచాంద: జిల్లాలో గడ్డెన్న, కడెం, సదర్మాట్, స్వర్ణ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. దీంతో పంటల సాగుకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ జిల్లాగా నిర్మల్ ప్రసిద్ధి చెందింది. రెండు పంటలకు సరిపడా సాగునీరు ఉండడంతో ఏటా రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. రోజురోజుకూ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. వ్యవసాయ పనులకు అవసరమైన కూలీలు దొరకడం లేదు. దీంతో కూలీల కొరతను తీర్చి రైతులను ఆదుకుకోవడానికి సబ్సిడీపై డ్రోన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎస్‌ఎంఏఎం పథకం కింద...
సబ్ మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్(ఎస్‌ఎంఏఎం) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాకు పది డ్రోన్లు మంజూరు చేసింది. ధరలో 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు.
వీరికి కేటాయింపు
జిల్లాకు కేటాయించిన పది డ్రోన్లలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీలు)కు కేటాయించనున్నట్లు డీఏవో అంజిప్రసాద్ తెలిపారు. 10 లీటర్ల సామర్ధ్యం ఉన్న డ్రోన్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని ఎఫ్‌పీఓలకు, పీఏసీఎస్‌లకు, ఎస్‌హెచ్‌జీల కు సబ్సిడీపై ఇచ్చే డ్రోన్ల సమాచారం మండల వ్యవసాయధికారుల ద్వారా ఇచ్చినట్లు డీఏవో తెలిపారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు త్వరగా పంపాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సబ్సిడీపై డ్రోన్లు అందచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కూలీల కొరత తీరుతుంది
రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందచేస్తున్న డ్రోన్లతో వ్యవసాయ రంగంలో కూలీల కొరత కొంత వరకు తీరుతుంది. వీటిని ఎఫ్‌పీవో, పీఏసీఎస్, ఎస్‌హెచ్‌జీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ సూచనల మేరకు అందిస్తాం.
– అంజిప్రసాద్, డీఏవో, నిర్మల్
జిల్లా సమాచారం...
జిల్లాకు మంజూరైన డ్రోన్లు 10
కనీస ధర (10 లీటర్ల సామార్ధ్యం)
రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు
అందించే సబ్సిడీ రూ.4 లక్షలు(గరిష్టంగా)
డ్రోన్లు ఇచ్చే సంఘాలు ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌లు, ఎస్‌హెచ్‌జీలు


