ఆర్జీయూకేటీ సరికొత్త రికార్డు
బాసర: బాసర రాజీవ్గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం అంతర్జాతీయస్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న నైట్ స్టడీ అవర్స్ ప్రోగ్రాం ఏకంగా మూడు రికార్డు బుక్కుల్లో చోటు సంపాదించింది. పీయూసీ1, పీయూసీ2 తరగతులకు చెందిన 3,238 మంది విద్యార్థులు ఒకే సమయంలో క్రమశిక్షణతో స్టడీ అవర్స్‌లో పాల్గొనడం ఈ రికార్డుకు దారితీసింది. ఈ అద్భుతమైన ఫీట్‌ను గుర్తిస్తూ.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు ధ్రువీకరణ పత్రాలు అందజేశాయి.
కార్యక్రమం ఇలా..
ప్రతీరోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అకాడమిక్ బ్లాక్–1లోని 46 క్లాస్ రూమ్‌లలో ఈ కార్యక్రమం జరుగుతోంది. చదువుకోవడంతోపాటు సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ సమయాన్ని కేటాయించారు. రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగుతోంది.
అధికారుల హర్షం..
ఈ విజయానికి కృషి చేసిన స్టడీ అవర్స్ ఇన్‌చార్జి డాక్టర్ గుజ్జరి శంకర్‌ను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్ ప్రత్యేకంగా అభినందించారు. శంకర్ పర్యవేక్షణలో విద్యార్థులు తరగతులకు హాజరవుతూ, సందేహాలను నివృత్తి చేసుకుంటూ అకడమిక్ పరంగా రాణిస్తున్నారన్నారు. డాక్టర్ శంకర్ నాయకత్వంలో అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో ఈ రికార్డు సాధ్యమైందని వారు కొనియాడారు. కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన డీన్ అకాడమిక్స్ శీలం శేఖర్, డీన్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ డాక్టర్ విఠల్, డాక్టర్ జి.నాగరాజు వివిధ విభాగాల అధిపతులు, బోధన బోధనేతర సిబ్బందికి శంకర్ ధన్యవాదాలు తెలిపారు.


