భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
ఆదిలాబాద్‌రూరల్: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విష్ణువర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన కొప్పులవార్ దేవనంద్ (24) ఈనెల 25న మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. ఈక్రమంలో మద్యం తాగొద్దని భార్య మందలించింది. దీంతో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి బాపురావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
రెబ్బెన: కడుపునొప్పి భరించలేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం దుర్గాపూర్ గొండుగూడకు చెందిన మడావి అజయ్ (18) బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతుండగా స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో గత నెల 27వ తేదీన వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. గ్రామ శివారులో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి, మంచిర్యాలకు, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


