చోరీ కేసు నిందితుల రిమాండ్
ఖానాపూర్: గత కొన్ని నెలలుగా ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలి పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నిర్మల్ డివిజన్‌లోని ఖానా పూర్, లక్ష్మణ్‌చాంద, నిర్మల్ టౌన్, మామడ తదితర మండలాల్లోని ఆలయాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ను పట్టుకున్నట్లు తెలిపారు. ఖానాపూర్ మండలం సేవ్యానాయక్ తండాలోని జగదాంబ ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నలు గురు వ్యక్తులను శుక్రవారం సత్తనపెల్లి గ్రామశివారులో, గురువారం మరో ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల వ్యవధిలో పట్టుబడిన నిందితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడే వారన్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన గాదె రమేశ్, దొసండ్ల శ్రీనివాస్, గురిజాల నడ్చి నర్సయ్య, బూట శంకర్, చీమల శ్రీకాంత్, బుర్క లక్ష్మణ్ అనే ఆరుగురు వ్యక్తులు కలిసి ఖానాపూర్ మండలంలోని తర్లపాద్ గ్రామంలో గల ఓంకారేశ్వర ఆలయం, అగ్గిమల్లన్న ఆలయం, మస్కాపూర్‌లోని శివాలయం, మధురనగర్‌లోని ఉగ్రనరసింహ స్వామి ఆలయం, ఖానాపూర్‌లోని సాయిబాబా ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో దేవునిపై ఉండే ఆభరణాలతో పాటు హుండీలో నగదును చోరీ చేశారన్నారు. ఖానాపూర్ సీఐ అజయ్, నిర్మల్ పట్టణ సీఐ నైలు, ఖానాపూర్ ఎస్సై రాహూల్ గైక్వాడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.


