ఇంకెన్ని ప్రాణాలు పోవాలి? | - | Sakshi
Sakshi News home page

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి?

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి?

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి?

ప్రమాదకరంగా భైంసా–నిర్మల్‌ హైవే ఇరుకు వంతెనలు, కనిపించని హెచ్చరిక బోర్డులు నిర్వహణలో హైవే అధికారుల నిర్లక్ష్యం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు

2024 జూన్‌ 16న అతివేగంగా వచ్చిన లారీ చిట్యాల వద్ద బ్రిడ్జిని ఢీకొని ఆగిపోయింది. అదృష్టవశాత్తు తృటిలో ప్రమాదం తప్పింది.

2024 జూన్‌ 19న నిర్మల్‌ పట్టణానికి చెందిన అద్దెకార్‌ క్రాంతికుమార్‌ (30) ద్విచక్ర వాహనంపై లోకేశ్వరం వైపు వస్తుండగా నర్సాపూర్‌ (జి) మండలంలోని రాంపూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఆటో ఢీకొని మృతి చెందాడు.

2025 మార్చి 29న లోకేశ్వరం మండలం బాగాపూర్‌కు చెందిన మాదరి భోజన్న (50) నర్సాపూర్‌ (జి) మండలం అర్లి(కే) ఎక్స్‌రోడ్‌ వద్ద ట్రాక్టర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

2025 ఫిబ్రవరి 27న అర్లి(కె) గ్రామానికి చెందిన మగ్గిడి సుధాకర్‌ (43) ద్విచక్ర వాహనంపై ఎక్స్‌రోడ్‌ దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సారంగపూర్‌ మండలం స్వర్ణ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు మనువడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా దిలావర్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద కారు ఢీకొట్టడంతో ఇద్దరూ మృతి

చెందారు.

భైంసాటౌన్‌: భైంసా–నిర్మల్‌ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, మరెందరో గాయాలపాలయ్యారు. తాజాగా, బుధవారం భైంసా మండలం బిజ్జూర్‌కు చెందిన కల్యాణ్‌కర్‌ శివాజీ ఓ శుభకార్యం నిమిత్తం భైంసాకు వచ్చి తిరిగి బైక్‌పై వెళ్తున్న క్రమంలో పట్టణంలోని నిర్మల్‌ చౌరస్తాలో లారీ ఢీకొని మృతి చెందాడు. అదేరోజు సాయంత్రం ఏపీనగర్‌కు చెందిన హన్మంత్‌రావు కారు ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇటీవల సాత్‌పూల్‌ వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో ఏకంగా నలుగురు దుర్మరణం చెందారు.

ఇరుకు వంతెనలు...

తానూరు మండలంలోని బెల్‌తరోడ నుంచి నిర్మల్‌లోని మంచిర్యాల చౌరస్తా వరకు జిల్లాలో ఈ హైవే 53. కి.మీ మేర విస్తరించి ఉంది. ప్రస్తుతం రెండులైన్ల రహదారికాగా కొన్నిచోట్ల ఇరుకై న వంతెనలున్నాయి. భైంసా పట్టణంలోని సాత్‌పూల్‌ వంతెన, మండలంలోని మాటేగాం, కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్‌(జి) మండలంలోని గుండంపల్లి క్రాస్‌రోడ్‌, నిర్మల్‌ వద్ద చిట్యాల బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భైంసాలోని నిర్మల్‌ చౌరస్తా, ఏపీనగర్‌ చౌరస్తా, నర్సాపూర్‌(జి), తల్వేద ఎక్స్‌రోడ్‌, దిలావర్‌పూర్‌ బస్టాండ్‌, చర్లపల్లి ఎక్స్‌రోడ్‌ వద్ద సైతం ప్రమాదాలకు కేంద్రంగా మారింది. న్యూలోలం, సిర్గాపూర్‌ బస్టాండ్‌ల వద్ద డివైడర్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

భద్రత చర్యలు కరువు...

జిల్లాలో హైవే వెంబడి చాలాచోట్ల రహదారి నిర్వహణ సక్రమంగా లేదు. కొన్నిచోట్ల రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డుపైకి ఆక్రమణలు, వాహనాల పార్కింగ్‌తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇష్టారీతిన యూటర్న్‌లు ఏర్పాటు చేయడం, అప్రోచ్‌ రోడ్ల వద్ద భద్రత చర్యలు లేవు. కొన్నిచోట్ల హైవే వెంబడి ప్రైవేట్‌ స్థలాల నిర్వాహకులు రెయిలింగ్‌ను తొలగించి దార్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి చోట హైవేపై వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్‌చార్జీలు వసూలు చేయడంపై ఉన్న దృష్టి.. రహదారి నిర్వహణపై హైవే అధికారులు చూపాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

భైంసాలో లెక్కకు మించి..!

భైంసా పట్టణంలోని నిర్మల్‌ చౌరస్తా వద్ద సిగ్నల్స్‌ వ్యవస్థ లేకపోవడంతో అధిక వేగంతో వచ్చే వాహనాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటే క్రమంలో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జాతీయ రహదారి మార్గంలో ఉన్న స్థానిక ఫైర్‌ స్టేషన్‌ కూడలి వద్ద, ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే కూడలి వద్ద కూడా ప్రమాదాలు అధికంగానే చోటు చేసుకుంటున్నాయి. కాలనీల్లోంచి రోడ్డుపైకి వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్లే వాహనాలు ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నారు.

నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తేనే...

జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి జిల్లాకు వాహనాల రాకపోకలు అధికంగానే ఉంటాయి. తానూర్‌ మండలంలోని బేల్‌తరోడా నుంచి భైంసా మీదుగా నిర్మల్‌ వరకు 61వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ మార్గం మీదుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం రెండు వరుసల రోడ్డు మాత్రమే ఉండడంతో పాటు పలుచోట్ల ఇరుకు వంతెనల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల వద్ద బస్టాప్‌లు నిర్మించినా వాటిని వినియోగించ డం లేదు. దీంతో రోడ్డు పక్కనే బస్సులు, ప్రైవేట్‌ వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో బస్సులు సైతం రహదారిపైనే నిలుపుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారిపై భారీ వాహనాలకు పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో పలుచోట్ల లారీ లు రహదారి పక్కనే నిలిపి ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో గమనించని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగు వరుసలతో రహదారిని అభివృద్ధి చేసి ఇరుకు వంతెనలను విస్తరిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గతంలో జరిగిన కొన్ని ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement