పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు పెంబి: ఆదివాసీ, లంబాడా గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గురువారం మండలంలోని రాంనగర్, పస్పుల గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాంనగర్, యాపలగూడ, వస్‌పల్లి, దోందారి, చాకిరేవు, పస్పుల, తదితర గిరిజన గ్రామాల ప్రజలు సమస్యలు విన్నవించారు. రోడ్డు, కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని, దోత్తి వాగుపై వంతెన నిర్మించాలని, పస్పుల వద్ద కడెం వాగుపై వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. సిరిచెల్మ రోడ్డు నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. దీనికి అటవీ అధికారుల నుంచి అనుమతులు వచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సమస్యలు లిఖితపూర్వకంగా రాసిస్తే జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. గిరిజనుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యుడిగా పెంబి మారుమూల గ్రామాలకు వచ్చినా జిల్లా అధికారులు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జానుబాయి, ఎంపీటీసీ రామారావు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే గిరిజనుల వెనుకబాటు కడెం: అధికారుల నిర్లక్ష్యమే గిరిజనుల వెనుకబాటుకు కారణమని ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. గురువారం రాత్రి థర్మాజీపేట్ జీపీ పరిధిలోని కుర్రగూడెంలో అటవీ, ఇతర అధికారుల తీరుపై మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డీఆర్డీవో విజయలక్ష్మి, సర్పంచ్ వొడ్నాల శిరీష సత్యం పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో ఘనస్వాగతం ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, పెంబి మండలాల పర్యటనకు వెళ్తున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. నాయకుడు బత్తుల నారాయణ వినతిపత్రం అందజేశారు.
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో జాప్యం జరగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను నేరుగా గిరిజన గూడాలకు చేరవేయడంలో యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాలన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వివరించారు. సమావేశంలో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిల, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా అటవీ శాఖాధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, అదనపు ఎస్పీలు రాజేశ్‌మీనా, సాయికిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.