పుష్కరాలకు ప్రణాళికలు రూపొందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: గోదావరి నది పుష్కరాల నిర్వహణ కు ఇప్పటి నుంచే పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాసర సరస్వతీ అమ్మవా రిని దర్శించుకోవడానికి, గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భ క్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తులకు వసతి, తాగునీరు, శాశ్వత మొబైల్ టాయిలెట్లు, లైటింగ్, మౌలిక సదుపాయాలు సమకూర్చాలన్నారు. చేపట్టిన పనులను సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలన్నారు.
పటిష్ట బందోబస్తు
ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, పటిష్ట నిఘా ఉంచుతామన్నారు. సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీలు రాజేశ్ మీనా, సాయికిరణ్, డీపీవో శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, బాసర ఆలయ ఈవో విజయ రామారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


