గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు
నిర్మల్‌చైన్‌గేట్: రానున్న గోదావరి నది పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పుష్కరాల ఏర్పాట్లపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బాసర జ్ఞానసరస్వతి ఆలయం, పుష్కర ఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతీ పుష్కరఘాట్ వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఘాట్‌ల నిర్మాణం, నీటి వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర వసతులు కల్పిస్తామన్నారు. ఇందులో డీపీవో శ్రీనివాస్, నీటిపారుదల ఈఈ అనిల్, జెడ్పీ సీఈవో గోవింద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, అధికారులు పాల్గొన్నారు.


