గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి చర్యలు

Feb 22 2026 7:03 AM | Updated on Feb 22 2026 7:03 AM

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి చర్యలు

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి చర్యలు

● ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ వినోద్‌కుమార్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ బీఎం.వినోద్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపకల్పనకు సంబంధించిన సమావేశం శని వారం నిర్వహించారు. అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వివిధ గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర పాలసీని రూపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే కమిటీ, జిల్లాలో పర్యటించిందని, గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులకు ఏ విధమైన పాలసీలు రూపొందించాలన్న విషయంపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గల్ఫ్‌ వలస కార్మికులు, వారి కుటుంబాలతో సమావేశమైందని వివరించారు. జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాలకు వలసలు అధికంగా ఉన్నాయని, గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు ఆయా దేశాల చట్టాలు, కార్మిక చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సు ఉన్న ఏజెన్సీల ద్వారానే కార్మికులు విదేశాలకు వెళ్లేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తరఫున టామ్‌ కామ్‌ ద్వారా కార్మికులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు. దీనిపై గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన అవసరమన్నారు. గల్ఫ్‌లో చిక్కుకున్న కార్మికులకు సహాయం అందించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.

ప్రత్యేక సెల్‌ అభినందనీయం..

అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ, జిల్లాలో గల్ఫ్‌ కార్మికుల సహాయార్థం హెల్ప్‌లైన్‌ ఏర్పా టు చేసినట్లు తెలిపారు. వివిధ గల్ఫ్‌లో చిక్కుకున్న పలువురు కార్మికులను కలెక్టర్‌ చొరవతో సురక్షితంగా స్వదేశానికి రప్పించామన్నారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి వివిధ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయన్నారు. జిల్లాలో గల్ఫ్‌ కార్మికుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయడాన్ని ఎన్‌ఆర్‌ఐ అడ్వయిజరీ కమిటీ అభినందించింది. కమిటీ బృందాన్ని, అధికారులను పలువురు సన్మానించారు. వైస్‌ చైర్మన్‌ భీమ్‌రెడ్డి, సభ్యులు శ్రీనివాసరావు, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, స్వదేశ్‌ పరికిపండ్ల, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement