బాసరలో హాల్టింగ్ ఇంకెప్పుడో?
భైంసా: బాసర రైల్వేస్టేషన్‌లో కొన్ని రైళ్లు ఆగుతున్నా ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌లకు హాల్టింగ్ లేదు. బాసర క్షేత్రంలో అమ్మవారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా వేలాది మంది యాత్రికులు రైలుమార్గం ద్వారా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ రైళ్లన్నీ నిలపకపోవడం, అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌లు స్టాఫ్ లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన నగరాల నుంచి నిజామాబాద్‌కు స్టాఫ్ ఉంది. యాత్రికులు, విద్యార్థులు అక్కడే దిగి ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. రైల్వే ఆదాయం పెంచే స్టేషన్‌గా బాసర ఉన్న ఆ శాఖ అధికారులు ఏళ్లుగా పట్టించుకోవడం లేదు. తిరుపతి–అమరావతి, హైదరాబాద్–జైపూర్ వంటి ప్రతిష్టాత్మక రైళ్లు బాసర స్టేసన్ మీదుగా దూసుకుపోతున్నాయి. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయానికై నా రైళ్లన్నీ నిలిపేలా ఆశాఖ అధికారులపై ఇక్కడి ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
అక్కడే ఆగిపోతున్నాయి
తిరుపతి నుంచి వచ్చే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌లోనే నిలిచిపోతుంది. ఈ రైలు బాసర వరకు పొడగించాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉన్న స్పందన లేదు. బాసర సమీప రైల్వే స్టేషన్ వరకు వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో నిత్యం వేల సంఖ్యలో యాత్రికులు ప్రయాణిస్తారు. బాసరకు 35 కి.మీ దూరంలో ఈ రైలు నిలిచిపోతుంది. ప్రతీరోజు ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని తిరిగి మధ్యాహ్నం 1 గంటకు రైలు బయల్దేరుతుంది. ఈ రైలు ఇక్కడి వరకు పొడగిస్తే బాసర క్షేత్రం నుంచి తిరుపతి వరకు వెళ్లే వీలుంటుంది. మరోవైపు 12 కి.మీ దూరంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ వరకు మరట్వాడా ఎక్స్‌ప్రెస్ బాసర వరకు పొడిగించడం లేదు. మహారాష్ట్ర నుంచి రాత్రి 11 గంటలకు ధర్మాబాద్ వచ్చి వేకువజామున 4 గంటలకు వెళ్లే ఈ రైలు బాసర వరకు పొడిగించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇక కరీంనగర్, కాచిగూడ డెమో రైళ్లు నిజామాబాద్‌కే పరిమితమవుతున్నాయి. ఈ రైళ్లను ఇక్కడి వరకు పొడిగిస్తే లోకల్ యాత్రికులకు ఎంతో ఉపయోగపడుతుంది.
బాసర స్టేషన్‌లో ఆగని రైళ్లు..
తిరుపతి– అమరావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్–జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
అజ్మీర్–రామేశ్వరం హామ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
రామేశ్వరం–ఓకా వీక్లీ ఎక్స్‌ప్రెస్
తిరుపతి–అకోల స్పెషల్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్–జైపూర్ ఎక్స్‌ప్రెస్
యశ్వంత్‌పూర్–ఇండోర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్


