ధర్మం కోసం ఏకమవ్వాలి
ఖానాపూర్: హిందుత్వ భావన, ధర్మ రక్షణ, దేశ రక్షణ బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని, ఇందుకోసం అంతా ఏకమవ్వాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నవనీత్‌రాణా కౌర్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలోని జగన్నాథ్‌రావు చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ సంకల్ప సభలో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎంఐఎం చీఫ్ ఒవైసీ దేశాన్ని ఆకు పచ్చమయం చేయాలని చూస్తున్నారని, హిందువులంతా దేశాన్ని కాశయమయం చేయాలన్నారు. ఖానాపూర్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రమేశ్‌రాథోడ్ ఆశయాలు కొనసాగించాలంటే ఖానాపూర్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ అన్నారు. అంతకుముందు పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో నవనీత్‌రాణా కౌర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖానాపూర్ ప్రబరీ పుల్లారావు, నాయకులు ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, రవీందర్‌రెడ్డి, అనిల్‌రావు, శారద, మాదిరే శ్రీనివాస్, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
భైంసాలో కాషాయ జెండా ఎగరేస్తాం..
భైంసాటౌన్: ‘భైంసా మున్సిపల్ ఎన్నికల్లో 12 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించండి చాలు.. భైంసా మున్సిపల్ చైర్మన్ పీఠం కై వసం చేసుకుని చూపుతాం’ అని అమరావతి మాజీ ఎంపీ నవనీత్‌రాణా కౌర్ అన్నారు. 12 మంది అభ్యర్థులను పోటీకి దింపి ఎలా అధికారంలోకి వస్తారన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నివాసంలో మాట్లాడారు. ఎంఐఎం గెలవకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిందువులు తమ నుదుటన బొట్టు పెట్టుకోవాలంటే వారికి ఎల్లప్పుడూ అండగా ఉండే బీజేపీకి ఓటేయాలని కోరారు. భైంసాలో ఎంఐఎం వరుసగా అధికారంలోకి రావడానికి హిందువుల్లో అనైక్యతే కారణమన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి పాండే, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


