హైటికాస్ సేవలు అభినందనీయం
కడెం: హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్‌సొసైటీ(హైటికాస్) స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని మండలంలోని ఉడుంపూర్ అటవీరేంజ్ అధికారి ప్రకాశ్, సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ అభినందించారు. గ్రామంలో సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు రెండు నెలలపాటు ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ అందించారు. శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అటవీ శాఖ ద్వారా చేపట్టే పనులకు తోడ్పడాలని కోరారు. అనంతరం హైటికాస్ సంస్థ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ కోఆర్డినేటర్ వెంకట్ ఎనగందుల మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ మహిళలకు చేతినిండా పని ఉండాలనే సదుద్దేశంతో గ్రామంలో శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలతో ఉపాధి పెంపొందించుకోవాలని కోరారు. గ్రామంలోని యువతీ యువకులకు కూడా హైదరాబాద్‌లో 45 రోజులపాటు బైక్, కార్ మెకానిజం, ఫుడ్ ప్రొడక్షన్, హౌస్ వైరింగ్, డాటా ఎంట్రీ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈడీఐఐ ప్రాజెక్ట్ అధికారి దేవేందర్, రాజేశ్వర్, నాంపల్లి సుమలత తదితరులు పాల్గొన్నారు.


