లెక్క చెప్పాల్సిందే..
పంచాయతీ ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి 45 రోజుల్లోపు చెప్పకపోతే మూడేళ్లు అనర్హత గత ఎన్నికల సమయంలో 1,858 మందిపై వేటు
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు ఖర్చు వివరాలు ఎంపీడీవోలకు సమర్పించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ఈ లెక్కలు సమర్పించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
పంచాయతీరాజ్ చట్ట ప్రకారం..
పంచాయతీ ప్రతినిధులుగా ఎన్నికై న వారు, మేమే గెలిచాం.. ఇక గ్రామానికి మేమే రాజులం అనే భావన వీడి.. సేవకులం అనే బాధ్యతను గుర్తించాలి. వారికి అధికారాలే కాదు.. కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం మరిచినా.. కుర్చీకే ఎసరు రావచ్చు. పంచాయతీరాజ్ చట్టం –2018 స్థానిక పాలకులకు పగ్గాలు వేసి, అవి ప్రజల చేతికిచ్చింది. 5 వేల జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యునికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5వేల కన్నా తక్కువగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యు నికి రూ.30 వేల వరకు ఖర్చు చేయాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజుల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీవోకు నిర్దేశిత పద్ధతిలో లెక్కలు చెప్పాలి. సకాలంలో లెక్కలు చూపకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మూడేళ్లు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటిస్తుంది. గెలిచిన వారు ఖర్చు వివరాలు ఇవ్వకుంటే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది.
మూడు విడతల లెక్కల సమర్పణ
అభ్యర్థులు మూడు దశల్లో ఖర్చు వివరాలు అధికారులకు ఇవ్వాలి. ప్రచారం ప్రారంభంలో మొదటి విడత, ప్రచార మధ్యలో రెండో విడత, పోలింగ్‌కు ముందు రోజు మూడో విడతగా వివరాలు 45 రోజుల్లో పూర్తి లెక్కలు బిల్లులతో సమర్పించాలి. నామినేషన్ పత్రంలో పేర్కొన్న బ్యాంకు ఖాతా ద్వారానే ఖర్చులు నిర్వహించాలి.
లెక్కల్లో చేర్చాల్సిన అంశాలు
పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్రింట్/డిజిటల్ ప్రకటనలు, వాహన అద్దె, ఇంధనం, మైకులు, టెంట్లు, భోజనం, కార్యకర్తల వేతనాలు, టీ–షర్టులు, బ్యాడ్జీ లు, ప్రచార వాహనాల అలంకరణలు సహా అన్ని వివరాలు చేర్చాలి. ధరలు ఎన్నికల అధికారుల నిర్ణయం మేరకు ఉండాలి. మండల వ్యయ పరిశీలకులకు మాత్రమే లెక్కలు సమర్పించాలి.
1,858 మందిపై అనర్హత వేటు..
2019 ఎన్నికల తర్వాత లెక్కలు చెప్పకపోవడంతో జిల్లాలో మొత్తం 1,858 మంది అనర్హతకు గురయ్యారు. వీరంతా 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం లేకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయితే ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో అనర్హత వేటు కాలపరిమితి ముగిసిపోయింది.


