పది పరీక్షలపై రగడ
నెలరోజుల షెడ్యూల్ ఇచ్చిన విద్యాశాఖ విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందనిఉపాధ్యాయ సంఘాలు కొత్త షెడ్యూల్ ఇచ్చే యోచనలో అధికారులు
నిర్మల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలపై రగడ నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ ఈసారి మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నెల రోజులపాటు షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతీ పరీక్షకు 4 నుంచి 5 రోజుల వ్యవధి ఇవ్వడాన్ని విద్యాశాఖ సమర్థిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిస్తుందని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏకపక్ష నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కొమురయ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలో రీ–షెడ్యూల్ అవకాశం ఉందని సంఘాలు తెలిపాయి. విద్యాశాఖ మాత్రం విద్యార్థుల ఒత్తిడి తగ్గించడం, పరీక్షలు సాఫీగా జరపడానికి సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాల పద్ధతిని అనుసరిస్తున్నామని వాదిస్తోంది.
నిర్వహణ సమస్యలు..
నెల రోజులపాటు పరీక్షలు ఉపాధ్యాయులకు భారంగా మారతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాల నుంచి పోలీసు స్టేషన్లకు, అక్కడి నుంచి కేంద్రాలకు రవాణా చేయడంలో ఎక్కువ కాలం పడటంతో లీకేజీ ప్రమాదం ఉందని, బాధ్యత తమపైనే పడుతుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని కొత్త షెడ్యూల్‌కు మార్చమని కోరుతున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లాం
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విషయమై రాష్ట్ర శాఖ తరఫున ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. పరీక్షల షెడ్యూల్‌లో ఎక్కువ రోజులు విరామం రావడంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ మార్చాలి.
– రమణారావు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
అశాసీ్త్రయంగా పరీక్షల షెడ్యూల్
పదో తరగతి పరీక్షల షె డ్యూల్ అశాసీ్త్రయంగా ఉంది. హై స్కూల్ తరగతుల పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ మార్చా లి. ఏప్రిల్‌లో తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా మూల్యాంకన ప్రక్రియలో జాప్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో లాగానే పరీక్షలు నిర్వహించాలి.
– పెంట అశోక్,
టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి


