సురక్షిత డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ
నిర్మల్‌చైన్‌గేట్: సురక్షిత డ్రైవింగ్‌తో రహదారి ప్రమాదాలు నివారించవచ్చని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, లాఅండ్‌ఆర్డర్ డీజీ మహేష్ భగవత్‌తో అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుందన్నారు. రహదారి భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమాల్లో అధికారులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీల సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని తెలిపారు. తరచూ ప్రమాదాలు సంభవించే ప్రదేశాలను గుర్తిస్తూ, తగు రక్షణ చర్యలను చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాలన్నీ కేవలం నెల రోజులకే పరిమితం కాకుండా, అనునిత్యం నిర్వహించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చునన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సీట్‌బెల్ట్, హెల్మెట్, సురక్షిత డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పర్యవేక్షణ వంటి అంశాలపై కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను తగ్గుతాయని వివరించారు.
విజయవంతానికి చర్యలు..
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు, అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులకు రహదారి నియమాలపై అవగాహన పెరిగేలా వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, రవాణా అధికారి దుర్గాప్రసాద్ అధికారులు పాల్గొన్నారు.


