విద్యార్థులను ఆరోగ్యంగా ఎదగనిద్దాం
లక్ష్మణచాంద: చక్కటి పోషక పదార్థాలు, ఖనిజలవణాలతో కూడిన ఆహారాన్ని అందించినప్పుడే పిల్ల లు శారీరకంగా, మానసికంగా చక్కగా ఎదుగుతారని డీఈవో భోజన్న అన్నారు. ప్రతీనెల మూడో శనివారం పాఠశాలల్లో నిర్వహించే పోషకుల దినోత్సవం సందర్భంగా సోన్ మండలం కడ్తాల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ‘వంటల పండగ‘లో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలను వంటగదికి పరిచయం చేసి ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలైన విటమిన్లు, కొవ్వులు, ఖనిజలవణాల ఆవశ్యకత తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు సమీకృత ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంతో ఉంటారన్నారు. మంచి ఆహారం తీసుకుంటేనే చదువులో, ఆటల్లో ఉత్సాహం కనబరుస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రకరకాల వంటలను రుచి చూశారు. ఇందులో ఎంఈవో తోడిశెట్టి పరమేశ్వర్, హెచ్‌ఎం రాజులదేవి రమేశ్‌బాబు, పాఠశాల చైర్మన్ రాజవ్వ, ఉపాధ్యాయులు రాధ, మంగమ్మ, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


