ఇంజినీర్లు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
బాసర: ఇంజినీర్లు వ్యాపార వేత్తలుగా ఎదగాలని ఆర్టీయూకేటీ ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వ్యాపార ఆసక్తి పెంచేలా, విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగడానికి మౌలిక నైపుణ్యాలు అందించే ప్రేరణాత్మక సదస్సు విజయవంతమైంది. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల వినూత్న ఆలోచనలకు దోహదపడుతుందని మురళీ దర్శన్ పేర్కొన్నారు. ఇ2, ఇ3 విద్యార్థులను ఆకర్షణీయ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, తెరిచిన మార్కెట్లు, ఆర్థిక సమీకరణలతో యువ ఆవిష్కర్తలకు ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. వ్యాపార ఆలోచనలు, ఎంట్రప్రెన్యూర్ పాత్ర, వ్యాపార స్థాపనలో రిస్క్‌లు తీసుకోవడం మధ్య తేడాలను స్పష్టం చేశారు.
కీలక లక్షణాలు, నైపుణ్యాలు
విజయవంతమైన వ్యాపారవేత్తలకు సృజనాత్మకత, పట్టుదల, ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం, బాధ్యతాభావం, రిస్క్ తీరు అవసరమని వివరించారు. కమ్యూనికేషన్, సమస్యల పరిష్కారం, నిర్ణయ సామర్థ్యం, సాంకేతిక జ్ఞానం, మౌలిక వ్యాపార, మానవ సంబంధ నైపుణ్యాలపై దృష్టి సారించారు. సదస్సులో డిస్కవరీ, కాన్సెప్ట్ డెవలప్‌మెంట్, రిసోర్సింగ్, యాక్చువలైజేషన్, హార్వెస్టింగ్‌లతో ఐదు దశల వ్యాపార ప్రక్రియను వివరించారు. ఆలోచన నుంచి వృద్ధి వరకు మార్గదర్శకత్వం అందించారు. బిజినెస్ ప్లానింగ్, మార్కెట్ విశ్లేషణ, ఆర్థిక ప్రణాళిక, చట్టపరమైన అంశాలు, నిధుల సమీకరణ మార్గాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ (ఇంజినీరింగ్) డాక్టర్ కె.మహేశ్, ఐఐఈడీ కోఆర్డినేటర్ రాకేశ్‌రెడ్డి, ఎఫ్‌ఐడీ ఎక్స్‌టర్నల్ లింకేజెస్ దిల్‌బహార్ పాల్గొన్నారు.


