
చేయి తడిపితేనే అనుమతి
నిర్మల్‌చైన్‌గేట్:వెలుగుల పండుగ అయిన దీపావళికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. దీంతో టాపాసుల దుకాణాల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. అయితే జిల్లాలో టపాసుల వ్యాపారానికి దళారుల బెడద ఇబ్బందిగా మారింది. దుకాణాల ఏర్పాటు, అనుమతుల పేరుతో కొందరు వ్యక్తులు వ్యాపారుల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దుకాణం కోసం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ‘‘అన్ని శాఖల ఫార్మాలిటీలు మనమే చూసుకుంటాం’’ అంటూ, ఇప్పటికే దళారులు వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఖరీదైన వెలుగుల పండుగ
టపాసుల దుకాణాల ఏర్పాటుకు తోడు పోలీసులు, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, అగ్నిమాపక శాఖలకు ఎప్పటిలాగే ఖర్చులు తప్పడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. మూడు రోజుల అమ్మకానికి ఒక్క దుకాణం కోసం రూ.40 వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖర్చులు తుదకు వినియోగదారులపై పడే అవకాశముందని, టపాసుల ధరలు కూడా ఈసారి భారీగా పెరిగే ప్రమాదం ఉన్నట్లు సూచిస్తున్నారు. నిర్మల్‌లో ఏటా దీపావళికి సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన టపాసులు అమ్ముడవుతాయి. ఈసారి మాత్రం వ్యాపార ఖర్చులు పెరగడంతో ధరల భారమంతా ప్రజలపై పడే అవకాశం ఉంది.
అనుమతుల పేరిట..
జిల్లాలో ప్రతీ దీపావళికి తాత్కాలిక టపాసుల మార్కెట్ ఏర్పాటు నియమిత ప్రక్రియగా మారింది. అయితే కొన్నేళ్లుగా కొందరు దళారులు గ్రూపులుగా ఏర్పడి ఈ ప్రక్రియను అదుపులోకి తీసుకున్నారు. ఒక దుకాణం సెటప్‌కి రూ.10 నుంచి రూ.12 వేల వ్యయం ఉంటే, అదనంగా అంతే మొత్తాన్ని ‘సాయం’ పేరుతో తీసుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 60 దుకాణాల వరకు ఏర్పాటైనా, వాటిలో సగానికి మాత్రమే అధికారిక లైసెన్సులు ఫీజు చెల్లించి పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందరికీ చెల్లింపులు..
ఈ ఏడాది నిర్మల్ కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 65కి పైగా టపాసుల దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ప్రతీ దుకాణం పేరుతో రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక విభాగాలకు చెల్లింపులు చేయాల్సి వస్తోందని, అలాగే విద్యుత్, నీరు, భద్రతా సదుపాయాల పేరుతో అదనపు లెక్కలు చూపుతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతేకాక, ఇప్పటికే లైసెన్సు పొందిన వ్యాపారులు తమ అనుమతులు తాత్కాలికంగా ఇతరులకు అమ్మి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోకపోతే దళారుల ఈ దోపిడీ కొనసాగుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.