
పోషకాహారంపై అవగాహన కల్పించాలి
నిర్మల్‌చైన్‌గేట్:పోషణ మాసం ముగింపు వేడుకలు పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో గురువారం నిర్వహించారు. మాతా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషణ మాసం ఎంతో ఉపయోగకరమన్నారు. నెల కార్యక్రమంగా కాకుండా, ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారం అందుతోందని భరోసా కల్పించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 17న ప్రారంభమై అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాల నివారణపై అవగాహన కల్పించామన్నారు. బాల్యంలో పోషకాహార లోపం అధిగమిస్తే భవిష్యత్తులో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి, దేశ నిర్మాణానికి తోడ్పడతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ శాఖకు సంబంధించిన సూచికల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందన్నారు. అంతకుముందు అంగన్‌వాడీ టీచర్లు పోషకాహారంపై నాటికలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. గర్భిణులకు సా మూహిక సీమంతం చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు పోషకాహార స్టాళ్లను పరిశీలించి, టీచర్ల సృజనాత్మకతను ప్రశంసించారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, సీడీపీవోలు, సంక్షేమ శాఖ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.