
పంచాయతీ కథ.. కంచికే!
పునరావాస జీపీ ఆశలు ఆవిరి స్థానిక’ ఎన్నికల షెడ్యుల్ విడుదలతో అయోమయం పునరావాస హామీలు అమలులోనూ జాప్యం..
కడెం: పులుల మనుగడ కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. పునరావాస గ్రామానికి తరలించారు. ఇక ఏడాది గడిచినా, రెవెన్యూ పట్టాలు పూర్తిగా అందజేయకపోవడంతో గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పునరావాస ప్యాకేజీలో భాగంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు ఇటీవల పాత గ్రామాలకు తిరిగి వెళ్లి గుడిసెలు వేసుకుని నిరసన తెలిపారు. ఏడాదిగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం కలెక్టర్, డీపీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆ ఆశలు ఆవిరయ్యాయి.
500లకుపైగా జనాభా..
ఈ రెండు గ్రామాల్లో జనాభా 500కు పైగా ఉండగా, ఓటర్ల సంఖ్య 300 దాటింది. రాంపూర్, మైసంపేట్ గ్రామాలు మండలంలోని ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ జరుగుతాయనేది అనిశ్చితంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పునరావాస కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి నిర్వహించారు. ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తారో తెలియకుండా ఉంది. పునరావాస ప్రాంతంలో బూత్ లేకపోతే, 35 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్‌కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
పరిష్కరించని హామీలు..
2024 ఏప్రిల్‌లో అటవీ శాఖ ఈ గ్రామాలను ఖాళీ చేయించి, పాతమద్దిపడగ సమీపంలోని పునరావాస కాలనీకి తరలించారు. 142 కుటుంబాల్లో 94 కుటుంబాలకు ప్యాకేజీ–1 కింద రూ.11.80 కోట్లు, 5 హెక్టార్లలో విద్య, విద్యుత్ వంటి సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందజేశారు. నచ్చన్‌ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో వ్యవసాయ భూములు కేటాయించారు. మిగిలిన 48 కుటుంబాలకు ప్యాకేజీ–2 కింద రూ.15 లక్షల పరిహారం, వ్యవసాయ భూములకు త్రీఫేజ్ విద్యుత్, సాగునీటి సదుపాయాలు, 94 కుటుంబాలకు ఉపాధి కోసం రూ.3 లక్షల రుణం, ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వంటి హామీలు ఇంకా అమలు కాలేదు. ఈ అసంపూర్ణతలతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.