
కొలువుదీరిన శారదమాత
భైంసాటౌన్: పట్టణంలో శారదమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాల అనంతరం శారదమాత విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంతోపాటు బ్రాహ్మణగల్లిలోని రాధాకృష్ణ మందిర్‌లో శారదమాత విగ్రహాలు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఐదురోజులపాటు అమ్మవారికి పూజలు చేసి, అనంతరం విగ్రహాలను గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నీటిలో నిమజ్జనం చేస్తారు.
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..
ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా యజ్ఞచార్యులు చక్రపాణి నర్సింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు కోటపల్లి అనీశ్, అర్చకులు కోటపల్లి నితీశ్ ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్టాపన, విష్ణుయాగం, ధ్వజారోహణం, అన్నసంతర్పణతోపాటు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నందీశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి జరిగిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్ రామునాయక్, బక్కి కృష్ణ, కోశాధికారి గాజుల శ్రీనివాస్, పండితులు, స్వాగతం పలికారు. . కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్ రామునాయక్, బక్కి కృష్ణ, కోశాధికారి గాజుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఆకుల రాజమణి, మాజీ ఎంపీటీసీ జంగిలి సరిత తదితరులు పాల్గొన్నారు.
సుర్జాపూర్‌లో పూజలు చేస్తున్న పండితులు
బ్రాహ్మణగల్లీలో పూజలో పాల్గొన్న మహిళలు
నేడు తుల్జాభవానీ జాతర
నిర్మల్ రూరల్: మండలంలోని రాణాపూర్ గ్రామంలో తుల్జాభవానీ జాతర ఆదివారం జరగనుంది. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు రాథోడ్ మహేందర్ మహారాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

కొలువుదీరిన శారదమాత