
డిగ్రీ విద్యార్థులకు టాస్క్‌పై అవగాహన
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్ విద్యార్థులకు టాస్క్ ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ప్రాధాన్యం గురించి వివరించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంపొందించుకుని భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టాస్క్ కోఆర్డినేటర్ ఎం.రజిత మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్యోగ మేళాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని రాబోయే అవకాశాలను సొంతం చేసుకోవాలని సూచించారు. అనంతరం పీఎంవీకే జిల్లా కోఆర్డినేటర్ జాదవ్ హరికుమార్ 2025 ఇండియా స్కిల్స్ పోటీ గురించి వివరించారు. 63 విభాగాల్లో విద్యార్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఉపయోగకరమని పేర్కొన్నారు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.