
మళ్లీ వాన
‘గడ్డెన్న వాగు’ గేట్లు ఎత్తివేత స్వర్ణ, కడెంకు వస్తున్న వరద పెరిగిన ‘సిరాల’ నీటి మట్టం పంట చేలల్లో నిలిచిన నీరు ఆందోళనలో అన్నదాతలు
భైంసా: రెండురోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి నుంచి మొదలై నిరంతరం పడుతోంది. ఇంతకుమందే వరదతో నీట మునిగిన పత్తి, సోయా పంటలు ఆరుతున్న క్రమంలో మళ్లీ వర్షం కురవడంతో పరిస్థితి మొదటికే వచ్చింది. వర్షాల ప్రభావంతో కాత, పూత లేక పత్తి చేన్లు ఎరుపురంగులోకి మారుతున్నాయి. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అధికారులు బుధవారం రాత్రి మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం ఒక గేటు ద్వారా దిగువకు నీరు వెళ్తోంది. సుద్దవాగు నీటి ప్రవాహం పెరగడంతో పరీవాహక ప్రాంత రైతులు పంటలు మునుగుతాయని ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వరదనీటితో సిరాల ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోంది. అలుగు నుంచి వస్తున్న నీరంతా ఇలేగాం చెరువులోకి వెళ్తోంది. అలుగు నీరు కాలువల గుండా వాగులో పడి సమీప పంట పొలాల్లోకి చేరుతోంది. వర్షం ఇలాగే కొనసాగితే పంటలు మరోసారి నీట మునిగే ప్రమాదముంది. వాతావరణ శాఖ ఈనెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో జిల్లాలోని రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తం చేస్తున్న అధికారులు
వర్షాలు కురుస్తుండడంతో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అధికారులు నది పరీవాహక ప్రాంతాల రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఏ సమయంలో గేట్లు ఎత్తే పరిస్థితి వస్తుందో తెలియదని.. పశువులు, మేకలు, గొర్రెల కాపరులు, రైతులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
జిల్లా నమోదైన వర్షపాతం ఇలా..
జిల్లా అంతటా 35.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కుభీర్ మండలంలో 74.0 మి.మీ, తానూరులో 20.6, బాసరలో 70.2, ముధోల్‌లో 79.6, భైంసాలో 54.2, కుంటాలలో 17.8, నర్సాపూర్(జీ)లో 21.2, లోకేశ్వరంలో 36.2, దిలావర్‌పూర్‌లో 19.6, సారంగపూర్‌లో 54.6, నిర్మల్‌లో 20.4, నిర్మల్‌రూరల్‌లో 12.6, సోన్‌లో 19.4, లక్ష్మ ణచాందలో 36.2, మామడలో 5.2, పెంబిలో 29.2, ఖానాపూర్‌లో 22.2, కడెంలో 50.8, దస్తూ రాబాద్‌లో 36.6 మిల్లి మీటర్ల వర్షం కురిసింది.
భైంసా: ‘సిరాల’ అలుగు నుంచి
పారుతున్న నీరు

మళ్లీ వాన