
హరితం.. అలసత్వం!
● మున్సిపాలిటీల్లో ‘వన’నిరుత్సాహం ● నామమాత్రంగా నాటుతున్న మొక్కలు ● రోడ్ల మధ్య ఇష్టారీతిగా పెరిగిన చెట్లు ● మొక్కల సంరక్షణపై పట్టింపు కరువు
నిర్మల్: ‘పేరుకు పట్టణాలు. కానీ.. పల్లెలే నయం. మొక్కలు నాటడంలో అలసత్వం. పెరిగే దశలో కాపాడటంలో నిర్లక్ష్యం. చెట్లయిన తర్వాత పట్టింపులేనితనం. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పచ్చదనా న్ని పరిశీలిస్తే.. కనిపించేవి ఇవేగా..’ అంటూ ఆయా పట్టణాలవాసులు నిట్టూరుస్తున్నారు. ఏళ్లుగా ప్రతీ సీజన్‌లోనూ మొక్కలు నాటుతూనే ఉన్నారు. కానీ.. ఇప్పటికీ సంపూర్ణ పచ్చదనం ఎందుకు లేదు..!? మొక్కలు నాటే ముందే ఏవి పెట్టాలి.. ఏ చెట్లు పెంచితే పర్యావరణానికి, ప్రజలకు మేలు చేస్తాయని ఎందుకు ఆలోచించడం లేదు..!? అన్న ప్రశ్నలూ వే స్తున్నారు. ఇప్పటిదాకా.. హరితహారం, వనమహోత్సవాల పేరిట మొక్కలపై పెట్టిన డబ్బుల లెక్కలూ తేల్చాలంటున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండోనెల పూర్తవుతున్నా.. ఇప్పటికీ నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మొక్కలు నాటడంలో జాప్యం జరుగుతూనే ఉంది.
ఏదీ ఉత్సాహం?
గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నా టిస్తే.. కాంగ్రెస్ సర్కారు వనమహోత్సవం పేరుతో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఈ కార్యక్ర మం నత్తనడకన సాగుతోంది. ఒక్కో మున్సిపాలిటీకి లక్షల్లో మొక్కలు నాటాలని లక్ష్యం విధించగా ఇప్పటివరకు వేలల్లో కూడా నాటలేదు. ఒకట్రెండు కార్యక్రమాలు నిర్వహించి, నాలుగైదు మొక్కలు నా టి చేతులు కడిగేసుకుంటున్నారు. సామూహికంగా మొక్కలు నాటడం, ఇంటింటికీ పంచడం తదితర కార్యక్రమాల్లో అలసత్వం కనిపిస్తోంది.
నిధులు వృథాయేనా!?
రాష్ట్రప్రభుత్వం మొక్కలు నాటడానికి ఏటా రూ.కో ట్లాది నిధులు వెచ్చిస్తోంది. ప్రజలు కూడా పన్నుల రూపంలో ప్రభుత్వానికి తోడ్పడుతున్నారు. కానీ.. ఆ నిధులు సద్వినియోగం చేయడం లేదన్న ఆరోపణ బలంగా ఉంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించి భారీగా ఖర్చు చేసి నర్సరీలు నిర్వహిస్తున్నారు. గుంతలు తవ్వడం, ట్రీగార్డులు తదితర పనులకూ ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటి లెక్కల్లో మాత్రం ప్రతీ ఏడాది అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. మరో వైపు ఏటా విరివిగా మొక్కలు నాటుతూనే ఉన్నా.. ఆ స్థాయిలో పచ్చదనం మాత్రం పెరగడం లేదు.
పెరిగిన లక్ష్యం.. పెరగని మొక్క
ఏటేటా మొక్కలు నాటే లక్ష్యం పెరుగుతూనే ఉంది. కానీ ప్రతీసారి నాటుతున్న మొక్కల సంఖ్య పెరుగుతుందే గాని నాటుకున్న మొక్కల సంగతి అధికారు లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అన్ని శాఖలూ కలిసి వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా.. చాలా శాఖలు కనీసం పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు. మున్సిపాలిటీల్లోనూ ఇదే అలసత్వం కనిపిస్తోంది. మొక్కలు నాటే లక్ష్యం పెరుగుతున్నా పెరిగే మొక్కలు మాత్రం తగ్గుతున్నాయి.
మున్సిపాలిటీల్లో వనమహోత్సవం ఇలా..
మున్సిపాలిటీ లక్ష్యం (లక్షల్లో) నాటినవి పంపిణీ చేసినవి పూర్తయినలక్ష్యం
నిర్మల్ 7.50 28,500 25,480 43,980
భైంసా 7.50 31,260 15,400 46,600
ఖానాపూర్ 4.80 15,000 1,033 16,033

హరితం.. అలసత్వం!