
జీతాలొస్తలెవ్!
● ఉపాధి ఉద్యోగులకు మూడు నెలలుగా అందని వైనం ● ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న చిరు ఉద్యోగులు
లక్ష్మణచాంద: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన కూలీలు వివిధ పనులు చేపట్టి ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం సజావుగా నిర్వహణకు వివిధ స్థాయిలలో సిబ్బంది కృషి చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఈ సిబ్బంది మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణలో ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మూడు నెలల జీతాలు పెండింగ్..
జిల్లాలోని 18 మండలాల్లో ఉపాధి పథకంలో పనిచేస్తున్న 373 మంది సిబ్బందికి మూడు నెలలుగా (ఏప్రిల్, మే, జూన్) వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీరు కూలీలకు పనులను కేటాయించడం, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం, వేతనాలు సకాలంలో చెల్లేలా చూడడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. వేతన బకాయిలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై చివరి వారానికి వచ్చినా వేతనాలు చెల్లించకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి రావాలి..
ఉపాదిహామీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. త్వరలోనే నిధులు విడుదలవుతాయి.
– నాగవర్ధన్, ఏపీడీ
కుటుంబ పోషణకు అప్పులు..
ఉపాధిహామీ పథకంలో ఎఫ్‌ఏగా పనిచేస్తున్న మాకు గత ఏప్రిల్ నుంచి జీతాలు రావడం లేదు. కుటుంబ పోషణ కోసం ఇతరుల వద్ద అప్పులు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి.
– రాములు, ఎఫ్‌ఏ, వడ్యాల్
త్వరగా విడుదల చేయాలి
గత మూడు నెలల నుంచి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి మా కుటుంబాలను ఆదుకునేందుకు వేతనాలు విడుదల చేయాలి.
– రవిప్రసాద్ ఈసీ, దస్తురాబాద్
జిల్లాలో సిబ్బంది వివరాలు..
ఏపీవోలు 12
ఈసీలు 5
కంప్యూటర్ ఆపరేటర్లు 38
టెక్నికల్ అసిస్టెంట్లు 72
ఫీల్డ్ అసిస్టెంట్లు 207
ఆఫీస్ సబార్డినేట్లు 18
డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది 21

జీతాలొస్తలెవ్!

జీతాలొస్తలెవ్!