
‘పల్లె పోరు’కు సన్నద్ధం
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించడంతో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగే ఈ ఎన్నికల కోసం ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
గడువు ముగిసి ఏడాది దాటినా..
2024 జనవరి 31న సర్పంచుల పదవీ కాలం ము గిసింది. జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కా లం ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు సామగ్రి సమకూర్చడం, సిబ్బంది కేటాయింపు, రిజర్వేషన్ల ఖరారు వంటి ఏ ర్పాట్లను చేపడుతోంది. ఓటరు జాబితాలు, బ్యాలె ట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. స్టేషనరీ, ఎన్నికల సామగ్రి జిల్లాలకు చేరాయి.
బ్యాలెట్ విధానంలో..
స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్ని కల కోసం బ్యాలెట్ పేపర్లు ముద్రించబడ్డాయి, బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పూర్తి చేయబడి, వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయబడ్డాయి. ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని సమాయత్తం చేయడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రిజర్వేషన్ల ఖరారు ఇక్కడే..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు గుర్తుల ఆధారంగా జరగవు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం పంపబడింది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. జిల్లాలో 157 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 65 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించారు. జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయబడుతుంది. మిగతా రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయిస్తారు.