పింఛన్‌కు ఫేస్‌ రికగ్నిషన్‌ | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌కు ఫేస్‌ రికగ్నిషన్‌

Jul 24 2025 8:38 AM | Updated on Jul 24 2025 8:38 AM

పింఛన

పింఛన్‌కు ఫేస్‌ రికగ్నిషన్‌

● నేడు హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌ ● త్వరలో బీపీఎంలకు సెల్‌ఫోన్లు ● ఈ నెల నుంచే నూతన విధానం

నిర్మల్‌చైన్‌గేట్‌: ఆసరా పింఛన్లను ఇక నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) విధానంతో అందజేయనున్నారు. వేలిముద్రల (బయోమెట్రిక్‌) ఆధారంగా పెన్షన్లు ఇస్తున్న విధానంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా యి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించేందుకు సులభంగా పింఛన్‌ అందజేసేలా ఫేస్‌ రికగ్నేషన్‌ విధానం అమలులోకి తెచ్చింది. ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 24న బీపీఎంలకు ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ అప్‌ లోడ్‌ చేసిన సెల్‌ఫోన్లు అందజేయనుంది. జూన్‌కు సంబంధించిన పింఛన్లు ఇంకా ఇవ్వలేదు. ఈనెల 24 తరువాత ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించారు.

వేలిముద్రలతో ఇబ్బందులు

పింఛన్‌ పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీస్‌లకు వెళ్లి ఆయా అధికారుల వద్ద బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు వేళ్లపై ముద్రలు చెరిగిపోయి స్కాన్‌ కాకపోవడంతో వారు పింఛన్‌ తీసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరో వైపు ఐరిష్‌లోనూ ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి వారు మండల, వార్డు అధికా రులు ప్రత్యేకంగా రాసిచ్చిన పత్రం ద్వారా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధుల్లో కొందరు రోగాల బారిన పడి ఇంటికే పరిమితమైన సమయంలో పింఛన్లు పొందలేకపోతున్నారు.

జిల్లాలో 1,47,103 మంది పెన్షనర్లు

ప్రస్తుతం రాష్ట్రంలో 10 రకాల పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఆయా కేటగిరీల్లో పింఛన్లు పొందే వారు జిల్లా వ్యాప్తంగా 1,47,103 మంది ఉన్నారు. వా రిలో వద్ధాప్య, వితంతు పింఛన్‌ దారులే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 35,150, వితంతు పింఛన్లు 36,326, వికలాంగుల పింఛన్లు 10,055, ఒంటరి మహిళల పింఛన్లు 2,110 మంది ఉన్నారు. మిగతావారు బీడీ కార్మికులు, చేనేత, కల్లుగీత కార్మికు లు, హెచ్‌ఐవీ, పైలేరియా, డయాలసిస్‌ పేషెంట్లు పింఛన్లు పొందుతున్నారు.

అక్రమాలు వెలుగుచూసే అవకాశం

ఆసరా పింఛన్‌ పొందుతున్న వారిలో కొందరు ఆధార్‌ కార్డుల్లో వయస్సును దిద్దించారు. తమకు ఎక్కువ వయస్సు ఉందని అధికారులను నమ్మించి పింఛన్లు పొందుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు సిఫారస్‌ చేసిన వారికీ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి. యాప్‌ను పకడ్బందీగా రూపొందిస్తే నకిలీ పీఎఫ్‌ కార్డులతో బీడీ పింఛన్‌ పొందుతున్న వారి వివరాలు కూడా వెలుగుచూస్తాయి. లబ్ధిదారుల పూర్తి వివరాలు యాప్‌లో ముందుగా అప్‌లోడ్‌ చేస్తే అన్ని వివరాలు తెలిసే అవకాశముంటుంది.

వివిధ సమస్యలకు చెక్‌

బయోమెట్రిక్‌ విధానంలో పింఛన్లు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వం ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ తీసుకువస్తోంది. ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌లో బీపీఎంలు పింఛన్‌దారుల పేర్లు, వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు. యాప్‌ ద్వారా ఫొటో తీసిన వెంటనే పింఛన్‌దారుడి వివరాలు వస్తాయి. వారికి పింఛన్‌ చెల్లించినట్లు నమోదు చేసి.. పింఛన్‌ మొత్తం అందజేస్తారు. ఇక నడవలేని వారు, వివిధ రోగాలతో మంచాలకే పరిమితమైన వా రికి చివరిరోజు ఇళ్లకు వెళ్లి ఫొటో తీసి పింఛన్‌ డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రతీ లబ్ధిదారుడికి సులభంగా పింఛన్‌ అందనుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకే..

పింఛన్ల పంపిణీలో ఫేస్‌ రికగ్నిషన్‌ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి సమావేశం, శిక్షణ ఉంటుంది. జిల్లా నుంచి ఒక ఎంపీడీవో, డీపీఎం, ఏపీఎంతోపాటు పోస్టల్‌ సిబ్బంది శిక్షణకు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం అధికారుల సూచనల ప్రకారం నడుచుకుంటాం.

– శ్రీనివాస్‌, ఇన్‌చార్జి డీఆర్డీవో

పింఛన్‌కు ఫేస్‌ రికగ్నిషన్‌ 1
1/1

పింఛన్‌కు ఫేస్‌ రికగ్నిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement