
హలో.. ఏసీబీ!
నిర్మల్: గతంలో ఏడాదిలో ఒకట్రెండు ఏసీబీ దాడులైతేనే జిల్లాలో చర్చనీయాంశంగా మారేది. ‘ఫలానా అధికారి ఏసీబీకి పట్టుబడ్డడట..’ అంటూ రోజుల తరబడి ప్రచారం సాగేది. కానీ.. ఇప్పుడు నెల వ్యవధిలోనే రెండు మూడు అవినీతి నిరోధక శాఖ దాడులు జరుగుతున్నాయి. ఒక్క నిర్మల్ మున్సిపాలిటీలోనే వరుసగా ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. స్టేషన్ బెయిల్ కోసం రూ.పది వేలు అడిగితే ఏకంగా ఎస్సైనే ఏసీబీకి పట్టించారు. ఇలా ఈమధ్యకాలంలో జిల్లాలో లంచావతారులపై చైతన్యవంతులు పైచేయి సాధిస్తున్నారు. లంచం అడిగితే చాలామంది ఏసీబీవైపు చూస్తున్నారు.
భయాన్ని ఆసరా చేసుకుని..
సార్ అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మళ్లీ మన పని ఆగుతుందేమో..!, ఏదైనా కారణం చెప్పి ఆపేస్తారేమో..! అన్న భయంతోనే చాలామంది కష్టమైనా లంచాలు ఇస్తున్నారు. బాధితుల భయాన్ని, అవసరాన్ని ఆసరా చేసుకునే చాలామంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వసూళ్లకు ఎగబడుతున్నారు. మండలాల్లో గ్రామీణుల అమాయకత్వాన్ని డబ్బులుగా దండుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్స్ వంటి నిత్యం ప్రజాసంబంధాలు ఉండే కొన్నిశాఖల్లో వాళ్లు చేయాల్సిన పనే అయినా.. అందుకు ప్రభుత్వం వేతనం ఇస్తున్నా అదనంగా లంచం ఇవ్వనిదే అధికారులు, సిబ్బంది ఏ పనీ చేయడం లేదు.
పెరుగుతున్న చైతన్యం..
‘ఏం సార్.. ఎందుకివ్వాలి సార్.. మీ పని మీరు చేయడానికి కూడా డబ్బులు ఇవ్వమంటారా.. ఇదెక్కడి అన్యాయం సార్..!?’ అన్న ప్రశ్నలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. వాళ్లు చేయాల్సిన విధినిర్వహణకు కూడా లంచాలు అడుగుతున్నవారిని నిలదీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మరో అడుగు ముందుకు వేస్తూ.. ఏకంగా ‘1064’కు కాల్ చేస్తూ ఏసీబీనే రంగంలోకి దించుతున్న ఘటనలూ పెరుగుతున్నాయి. జిల్లాలో ఈ మధ్యకాలంలో లంచాలు అడిగినవారిని ఏసీబీకి పట్టించాలన్న చైతన్యం కనిపిస్తోంది. ఇందుకు వరుసగా జిల్లాలో చోటుచేసుకుంటున్న అవినీతి నిరోధక దాడులే ప్రతక్ష్య ఉదాహరణ.
ఫోన్ చేస్తే చాలు..
అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్న వారెవరైనా ప్రజల నుంచి లంచాలను తీసుకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవు. అవినీతి నిరోధకశాఖ ప్రత్యేకంగా లంచాలను నిర్మూలించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. నిర్మల్ ప్రాంతం నుంచి ఇటీవల బాగానే కేసులు వస్తున్నాయి. ఎవరు లంచం అడిగినా.. కేవలం 1064 టోల్‌ఫ్రీ నంబర్ లేదా, 91543 88963 నంబర్‌కు ఫోన్‌చేసి చెబితే సరిపోతుంది.
– జి.మధు, డీఎస్పీ, ఏసీబీ
రెండేళ్లలో జిల్లాలో నమోదైన ఏసీబీ కేసులు
అయినా మారడంలేదు..
బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నా.. అవినీతి నిరోధకశాఖ తరచూ దాడులు చేస్తున్నా.. కొంతమంది వసూల్ రాజాలు మాత్రం మారడం లేదు. ఇప్పటికీ ప్రతీపనికి రేటు పెడుతున్నారు. పెద్దోడు, పేదోడు అనే తేడా కూడా చూడకుండా వసూలు చేస్తున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలోనే ఒక ఏడాది వ్యవధిలో మూడు ఏసీబీదాడులైనా.. ఆరుగురు అరెస్టయినా.. వసూళ్లపర్వం మాత్రం ఆగడం లేదు. జిల్లాస్థాయి హోదాలో ఉన్న అధికారులే భారీమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
లంచమిచ్చినా తప్పే..
డబ్బులిస్తే ఏపనైనా అయిపోతుంది.. అందరికంటే ముందే పూర్తవుతుంది.. అన్న ధోరణిలో కొందరు అధికారులు, సిబ్బంది అడగకున్నా లంచాలిచ్చి మరీ పనులు చేయించుకుంటున్నారు. ‘ఎంతోకొంత ఇస్తే వాళ్లే చేస్తారు. మళ్లీ ఎప్పుడైనా పనికొస్తారు..’ అంటూ ప్రోత్సహిస్తున్నవాళ్లూ ఉన్నారు. కానీ.. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్–1988 ప్రకారం లంచం తీసుకోవడంతోపాటు ఇచ్చినా నేరమే అవుతుంది.
లంచంఅడిగితే.. 1064 నంబర్‌కు కాల్
జిల్లాలో పెరుగుతున్న చైతన్యం
ఇటీవల విరివిగా దాడులు
జంకుతున్న లంచావతారులు
2023–24 05
2024–25 04

హలో.. ఏసీబీ!