
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో చోరీలు ● చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుని పరారీ ● ద్విచక్ర వాహనం, ఫోన్ స్వాధీనం
చింతలమానెపల్లి/కౌటాల: చింతలమానెపల్లి, కౌ టాల మండలాల్లో మంగళవారం రాత్రి దొంగలు బీ భత్సం సృష్టించారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా ఓ ఉపాధ్యాయుడు సాహసించి పట్టుకునే ప్రయత్నం చేయగా చేజారాడు. ఎస్సైకి ఎదురుపడగా.. అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేయగా చిక్కినట్టే చిక్కి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం అడెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణంలో మంగళవారం రా త్రి 10.30గంటలకు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక వైపు తలుపు పగులగొట్టి రూ.70వేలు ఎత్తుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన యజమాని మహేష్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కౌటాలలో చేతికి చిక్కి..
కౌటాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు వెళ్లారు. రాత్రి 11గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో ఇద్దరు దొంగలు ఉండడాన్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ దొంగను పట్టుకోగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అతడి బట్టలు సైతం చిరిగిపోయాయి. సెల్‌ఫోన్ అక్కడే పడిపోయింది. అయినా గోడ దూకిన దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.
పెట్రోలింగ్ పోలీసులకు ఎదురుపడి..
ఇదే సమయంలో కౌటాలలో ఎస్సై గుంపుల విజయ్ వాహనాల తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 12గంటల ప్రాంతంలో మోటార్‌సైకిల్ వేగంగా రావడాన్ని గమనించి అనుమానంతో అనుసరించారు. దీంతో దొంగలు మోటార్‌సైకిల్‌ను ధనురేటి గ్రామ సమీపంలో వదిలేసి పారిపోయారు. మోటార్‌సైకిల్ నంబరు ఆధారంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. మోటార్‌సైకిల్‌తోపాటు మొబైల్‌ఫోన్‌ను కౌటాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రెండు మండలాల్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠా దొంగలని తెలుస్తోంది. డబ్బాలో చోరీకి పాల్పడడానికి సమీపంలోని మెకానిక్ దుకాణం నుంచి గునపాన్ని దొంగిలించి అదే గునపంతో డబ్బా, కౌటాలలో తలుపులను పగులగొట్టినట్లు సీసీ కెమెరాల్లో వీడియోలను బట్టి తెలుస్తోంది. వేర్వేరుగా నమోదైన కేసుల్లో విచారణను వేగవంతం చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని కౌటాల ఎస్సై గుంపుల విజయ్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు.

అర్ధరాత్రి దొంగల బీభత్సం