
పోడు కోసం పోరాటం
● పునరావాస భూముల్లో హద్దురాళ్లు ● అడ్డుకున్న గిరిజనులు ● మధ్యాహ్నం వరకు ఉద్రిక్తత ● పనులు నిలిపివేసిన అధికారులు
కడెం: మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ గ్రామ పరి ధిలోని పెత్తర్పు సమీపంలో అటవీ భూమి కోసం గిరిజనులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాలకు కేటాయించిన వ్యవసాయ భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ, ఆటవీ శాఖ అధికారులు పోలీసు బందోబస్తుతో మంగళవారం సర్వే చేపట్టారు. తాము ఏళ్లుగా సాగుచేస్తున్న పోడు భూముల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతి రేకిస్తూ గొండుగూడ వాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు భూములు కేటాయించిన తర్వాతే పునరావాస గ్రామస్తులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేశారు. తమ భూములను వదులుకోమని పట్టుబట్టడంతో అధికారులు తాత్కాలికంగా సర్వే పనులను నిలిపివేశారు.
గిరిజనులతో మాట్లాడిన ఆర్డీవో, ఎఫ్‌డీవో
ఆర్డీవో రత్నకళ్యాణి, ఎఫ్‌డీవో రేవంత్‌చంద్ర గోండుగూడ గిరిజనులతో మాట్లాడారు. 2015లో అటవీ భూములను పునరావాస గ్రామాల ప్రజల కోసం డీనోటిఫై చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఆర్డీవో తెలిపారు. చట్టప్రకారం రాంపూర్, మైసంపేట్ గ్రామాల పునరావాస ప్రజలకు భూములు చెందుతాయని తెలిపారు. ఈ సర్వే భూముల తుది హద్దులను గుర్తించేందుకేనని చెప్పారు. ఈ సర్వేపై ఆందోళన చెందవద్దని, ఏవైనా సందేహాలుంటే అధికారులను సంప్రదించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఏఎస్పీ రాజేశ్ మీనా, సీఐ ఆజయ్, ఎస్సైలు సాయి కిరణ్, సాయి కుమార్ బందోబస్తు విధులను పర్యవేక్షించారు.

పోడు కోసం పోరాటం