
ఐఎంఏ ఆధ్వర్యంలో వనమహోత్సవం
నిర్మల్‌ఖిల్లా: ప్రకృతితోనే మానవ మనుగడ సాధ్యమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్మల్ శాఖ కార్యవర్గ సభ్యులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ సంఘ కార్యాలయంలో వైద్యులు దాదాపు 100కు పైగా మొక్కలను నాటారు. ప్రకృతి ఒడిలో అనేక రకాల మొక్కలు ఫలాలను, నీడను, ఔషధాలను అందిస్తున్నాయని తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టి అవి పెరిగే వరకు రక్షించాలని సూచించారు. అనంతరం వనమహోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ నిర్మల్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీధర్, ప్రమోద్‌చంద్రారెడ్డితోపాటు సీనియర్ వైద్యులు అప్పాల చక్రధారి, ఉప్పు కృష్ణంరాజు, రామకృష్ణ, జి.రమేశ్, దేవేందర్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, శ్రీనివాస్, సుచిన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.