
కొండంత ఆశతో...
● ఆగిన బాసర ఆలయ అభివృద్ధి ● సమస్యల్లో ట్రిపుల్ ఐటీ ● క్షేత్రం అభివృద్ధీ అంతంతే.. ● నేడు బాసరకు మంత్రుల రాక
భైంసా: తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం బాసర సరస్వతీ ఆలయం. ఇక్కడి ట్రిపుల్ ఐటీకి కూడా మంచి గుర్తింపు ఉంది. ఆలయం నిత్యం భక్తులతో, ట్రిపుల్ ఐటీ నిత్యం విద్యార్థులతో సందడిగా ఉంటాయి. అయితే, ఈ రెండు కేంద్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం, సౌకర్యాల కొరత ఎదుర్కొంటున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు ప్రకటించినా, రూ.8 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. మిగతా రూ.42 కోట్లు వెనక్కు వెళ్లాయి. వాటిని కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మొదటిసారిగా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి శనివారం వస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బాసర ట్రిపుల్‌ఐటీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
సరస్వతీ ఆలయంలో సౌకర్యాల కొరత..
దేశంలో రెండవ ప్రాచీన సరస్వతీ ఆలయంగా పేరొందిన బాసర క్షేత్రానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే భక్తులకు ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడి గోదావరి నదిలో స్నానాల సమయంలో జరిగే ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 2021 నుంచి 2025 వరకు 127 మందికిపైగా భక్తులు నీటమునిగి మృతిచెందారు, ఈ ఏడాది ఇప్పటికే 8 మంది చనిపోయారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అప్పటిలోగా ఆలయ అభివృద్ధి, సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
పరిపాలనలో లోపాలు..
బాసర ఆలయానికి శాశ్వత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) లేరు. ఇన్‌చార్జి అధికారితో పరిపాలన కొనసాగిస్తున్నారు. దీంతో అవినీతి, నిర్వహణ లోపాలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే పరిపాలన గాడిన పడుతుందని భక్తులు ఆశిస్తున్నారు.
వైద్య సౌకర్యాల లేవు..
బాసరలో 9 వేల మంది విద్యార్థులు, వేలాది భక్తులు ఉన్నప్పటికీ, పెద్ద ఆస్పత్రి లేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, 30 పడకల ట్రిపుల్‌ఐటీ ఆస్పత్రి మాత్రమే ఉన్నాయి. అత్యవసర సమయాల్లో భైంసా, నిజామాబాద్‌కు తరలించాల్సి వస్తోంది. ఈ ప్రధాన సమస్యల పరిష్కారంపై మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు దృష్టిసారించాలి భక్తులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, బాసర పట్టణ ప్రజలు కోరుతున్నారు.
‘ట్రబుల్’ ఐటీ..
ఇక రాష్ట్రంలో ఏకై క ట్రిపుల్‌ఐటీ క్యాంపస్ బాసరలో ఉంది. 9 వేల మంది విద్యార్థులతో ఉన్నప్పటికీ, మూడేళ్లుగా యూనిఫామ్, ల్యాప్‌టాప్, ఇతర సామగ్రి అందడం లేదు. 150 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నా యి. శాశ్వత వీసీ లేకపోవడం, పాత కాంట్రా క్టర్ల కొనసాగింపు, మెనూ ప్రకారం భోజనం అందకపోవడంతో విద్యార్థులు సమస్యల మధ్యే చదువులు కొనసాగిస్తున్నారు.
మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
బాసర: ఆర్జీయూకేటీలో శనివారం నిర్వహించనున్న వనమహోత్సవంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళిదర్శన్ శుక్రవారం పర్యవేక్షించారు. భద్రతా చర్యలు, విద్యార్థుల భాగస్వామ్యంపై సమీక్ష చేశారు. కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు సూచించారు.

కొండంత ఆశతో...