
కేజీబీవీలకు కొత్త టీచర్లు..!
● వివిధ పాఠశాలల్లో 13 ఖాళీలు ● 2023లో నిర్వహించిన రాత పరీక్ష ఆధారంగా భర్తీ
నిర్మల్ రూరల్: పేద బాలికల విద్యను బలోపేతం చేసేందుకు, మధ్యలో చదువు మానకుండా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్నేళ్లుగా కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇంటర్మీడియెట్ తరగతులు నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో నర్సాపూర్(జి), దిలావర్‌పూర్, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, ఖానాపూర్ ప్రాంతాల్లో ప్రవేశాలు రెట్టింపు జరిగాయి.
6 వేల మంది విద్యార్థులు..
జిల్లాలో 18 కేజీబీవీలు ఉండగా, ఇందులో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యను అందిస్తున్నారు. దాదాపు 6 వేల మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం 209 మంది టీచింగ్ సిబ్బంది, 227 మంది నాన్–టీచింగ్ సిబ్బంది ఉన్నారు. అయితే, విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్నిచోట్ల సబ్జెక్ట్ టీచర్ల కొరత, మరికొన్ని చోట్ల వ్యాయామ ఉపాధ్యాయుల లేమి ఉన్నాయి.
ఖాళీల భర్తీకి ఆదేశాలు..
రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలలో ఉపాధ్యాయుల కొరతను గుర్తించిన ఉన్నతాధికారులు, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టారు. 2023లో నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్ అభ్యర్థులతో ఈ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో 13 ఖాళీల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ)లను, ఇంటర్మీడియట్ బోధనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్(పీజీసీఆర్టీ)లను నియమించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికను రూపొందిస్తున్నారు. 20 రోజుల్లో నియామక ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.
వివరాలు...
జిల్లాలోని మొత్తం కేజీబీవీలు 18
విద్యార్థినుల సంఖ్య 6వేలు(సుమారు)
టీచింగ్ స్టాఫ్ 209
నాన్ టీచింగ్ స్టాఫ్ 227
భర్తీ చేయనున్న పోస్టులు 13
మెరిట్ ప్రకారం భర్తీ..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కేజీబీవీలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూస్తా. 2023లో నిర్వహించిన రాత పరీక్షలో సాధించిన మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తాం. రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం భర్తీ ప్రక్రియ ఉంటుంది.
– సలోమి కరుణ, కేజీబీవీ జిల్లా అధికారి