
పుస్తకాల గోదాంను పరిశీలించిన ఆర్జేడీ..
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంను ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి శని వారం పరిశీలించారు. జిల్లాకు వచ్చిన పుస్తకా ల సంఖ్య రావాల్సిన సంఖ్య, ఇప్పటివరకు పంపిణీ చేసిన పుస్తకాల వివరాలు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ షెడ్యూల్ ప్రకారం ఆయా పాఠశాలలకు పుస్తకాలను సక్రమంగా అందజేయాలని సూచించారు. ఆయన వెంట డీఈవో రామారావు గోదాం మేనేజర్ భానుమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు.
కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలు
జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలకు డీఈవో రామారావు పాఠ్యపుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, కుబీర్ మండలాల ఎస్‌ఓలకు అందజేశారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను అందజేశారు. మిగతా కేజీబీవీలకు మరో రెండు రోజుల్లో పుస్తకాలు అందజేస్తామని డీఈవో తెలిపారు.
పొట్టపెల్లి(కె)లో ముగిసిన ధాన్య కొనుగోళ్లు
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. గ్రామంలో మొదటిసారి యాసంగిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. శనివారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయని సెంటర్ నిర్వాహకురాలు మమత తెలిపారు. 128 మంది రైతుల నుంచి 12,151 బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని 16 లారీలలో మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. రైతుల సహకారంతో ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పూర్తి చేశామని తెలిపారు. రైతుల వివరాలు ఆన్‌లైన్ చేస్తున్నామని, చెల్లింపులు కూడా రెండు రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు.