
ఫోన్ పోతే ఆందోళన వద్దు
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చెయ్యాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. https://www.ceir. gov.in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 52 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా గుర్తించి, స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఎస్పీ జానకీషర్మిల ప్రధాన పోలీస్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మార్కెట్‌లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. సీఈఐఆర్ వైబ్సెట్ ద్వారా ఇప్పటి వరకు పోయిన 1,309 ఫోన్లు రికవరీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటీ కోర్, వివిధ పోలీస్ స్టేషన్‌లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.